
పరిశ్రమలపై ‘చిన్న’చూపు
తాడేపల్లి రూరల్: నూతన రాజధాని అమరావతిలో ఉన్న చిన్న పరిశ్రమలను తరలించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దానిలో భాగంగా తాడేపల్లిలో ఉన్న ఐఓసీ స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్‌ను తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఐఓసీ స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ రాష్ట్రం నుంచి తరలిపోతుంటే ఏమాత్రం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఫిల్లింగ్ ప్లాంట్ పరిశ్రమను నమ్ముకుని అందులో పర్మినెంట్ ఉద్యోగులు కాకుండా 80 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ద్వారా మరో 120 మంది కుటుంబాలను పోషించుకుంటున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్లు కాకుండా వాహన యజమానుల కుటుంబాలు ఈ కంపెనీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. చిన్న పరిశ్రమలను ప్రభుత్వం కాపాడాలని కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు. కంపెనీ మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారులే స్వయంగా వేరే ఉద్యోగాలు చూసుకోండంటూ కార్మికులకు చెబుతున్నారు. దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన పెరిగింది. 5 నెలల క్రితం వరకు ఇక్కడ ఉన్న ఆయిల్ కంపెనీలో 2500 కేఎల్ ఇంజిన్ ఆయిల్ ఉత్పత్తి చేయగా, దానిని క్రమక్రమంగా వెయ్యి కేఎల్‌కు తీసుకొచ్చారు. త్వరలోనే కంపెనీ మూసివేస్తారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.