
నేటి నుంచి కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సమ్మె
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్‌ఎం గ్రేడ్ –2ల సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం కమిటీ జనరల్ బాడీ సమావేశం రామ్‌ప్రభాకర్, జి.నాగరాజుల అధ్యక్షతన జరిగింది. చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ నాగ బ్రహ్మచారి, జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు సుబ్బారెడ్డి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని, దీనికి పూర్తిగా యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు జానీ, పవన్, రాంబాబు, వంశీ, అందే రాజేష్, కొండా, చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.