
వర్షానికి పోలీస్ గ్రీవెన్స్ రద్దు
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు డీపీఓ వర్గాలు తెలిపాయి. సుదూర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన ద్వారం వద్ద పహారా నిర్వహించే పోలీస్ సిబ్బంది వారికి విషయం తెలిపారు. పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పీజీఆర్‌ఎస్ కొనసాగడంతో బాధితులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో షామియానాలు, కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. బాధితులు డీపీఓ ఎదుట మీడియాతో మాట్లాడారు.
రూ.1.5 కోట్ల వరకు టోకరా..
ఏటీ అగ్రహారం 13వ వీధిలో ఉంటున్న ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు గత 25 ఏళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తున్నారు. రోజూవారీ పనులకు వెళ్తూ చిట్టీలు చెల్లించాం. అడిగితే మాపై దాడికి సిద్ధమవుతున్నారు. అరవై మందికిపైగా బాధితులు ఉన్నారు. సుమారు రూ.1.5 కోట్లు వరకు చెల్లించాలి.
– బాధితులు, ఏటీ అగ్రహారం
ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం
గుంటూరు వెస్ట్: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసమే అర్జీలు పెట్టుకుంటారని, దీనిని గుర్తించి అధికారులు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌కే ఖాజావలి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో అర్జీలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలని దళిత బహుజన ప్రజా సంఘాలు, పార్టీల ఐక్యవేదిక నేతలు కోరారు. 228 అర్జీలను డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా పరిషత్ సీఈవో వి.జ్యోతి బసు, డ్వామా పి.డి. శంకర్ పరిశీలించారు.