పేరుకుపోతున్న వ్యర్థాల గుట్టలు పనిచేయని మూడు కాంపాక్టర్లు దెబ్బతింటున్న సాగు భూములు స్థానికులకు తప్పని తీవ్ర ఇబ్బందులు
తెనాలి కంపోస్ట్ యార్డు వ్యర్థాల గుట్టలతో నిండిపోతోంది. రోజూ తెనాలిలో ఉత్పత్తి అయిన వ్యర్థాలను జిందాల్ సంస్థకు తరలించాలని ఆదేశాలున్నా అమలు కావడం లేదు. భూగర్భ జలాలు కలుషితమై పంట పొలాలు దెబ్బతింటున్నాయి. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మొత్తం 1.07 లక్షల టన్నుల వ్యర్థాలు
తెనాలి అర్బన్: కంపోస్ట్ యార్డులోని వ్యర్థాల గుట్టల కారణంగా సమీపంలోని పంట పొలాలకు సమస్యలు తలెత్తుతున్నాయి. యార్డు ప్రహరీలు పడిపోతున్నాయి. చెత్త నుంచి మిథైల్ గ్యాస్ విడుదలవుతూ దానికదే తగులబడుతోంది. వ్యర్థాల దగ్ధంతో రోజుల తరబడి హానికరమైన పొగ చుట్టుపక్కల అర కిలోమీటరు వరకూ వ్యాపిస్తోంది. దీంతో ప్రజలకు కళ్లు మండుతున్నాయి. ఊపిరి పీల్చుకోవటానికి కూడా వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. యార్డు దారిలోనే పలు విద్యాసంస్థలు, పప్పు మిల్లులు ఉన్నాయి. అతిదగ్గర్లోనే అపార్టుమెంట్లు, బీసీ కాలనీ ప్రజలు ఉంటున్నారు. యార్డు కారణంగా స్థానిక ప్రజలు, రైతులు, విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. యార్డును తరలించాలని కోరుతున్నారు.
మూలకు చేరిన కాంపాక్టర్లు
తెనాలి పట్టణంలో చెత్త సేకరణ కోసం ఏడు కాంపాక్టర్లు వినియోగిస్తున్నారు. తెనాలిలో రోజూ ఉత్పత్తి అయ్యే 90 టన్నుల చెత్తలో 80 టన్నులను కాంపాక్టర్‌లలో గుంటూరు సమీపంలోని జిందాల్ సంస్థకు కొద్దినెలలుగా నిత్యం తరలిస్తున్నారు. మిగిలిన 10 టన్నులను ఇక్కడే యార్డులో పడేస్తున్నారు. నెల క్రితం ఒకటి పెద్దది, రెండు చిన్న కాంపాక్టర్లు మరమ్మతులకు గురయ్యాయి. యార్డుకు వెళ్లే దారి కూడా వ్యర్థాలతో నిండి దుర్వాసన వస్తోంది. వాహనాలు పాడవడం వలన పట్టణంలో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ జరగటం లేదని సమాచారం.
యార్డులోని వ్యర్థాల పరిమాణం 1.07 లక్షల టన్నులు ఉండవచ్చని అధికారుల అంచనా. మున్సిపల్ అధికారులు 63,550 టన్నుల చెత్త తరలింపు కోసం టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంసస్థీ టెండర్లు దక్కించుకుని ఫ్రిబవరిలో పని ప్రారంభించింది. మే నెలలో టెండర్లు రివైజ్ చేసి, 72 వేల టన్నుల చెత్తను తరలించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. జూన్‌లో మరోసారి మిగిలిన 35 వేల టన్నుల చెత్త తరలింపునకు టెండర్లు పిలిచారు. అదే సంస్థ టెండర్లు దక్కించుకుని, గత నెల చివరిలో పనులు ప్రారంభించింది.
కంపోస్ట్ యార్డుతో కష్టాలు