
సామాన్యుడి ధైర్యం.. సమాచార హక్కు చట్టం
అందరూ సద్వినియోగం చేసుకోవాలి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని
మంగళగిరి టౌన్: సమాచార హక్కు చట్టం సామాన్యుడికి కొండంత ధైర్యమని.. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హైకోర్టు విశ్రాంతన్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు మాజీ సమాచార కమిషనర్ కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమిషనర్లు శామ్యూల్, డాక్టర్ చావలి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం వల్ల దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండేలా చూడడంతోపాటు.. ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు. కాగా, కమిషన్ సజావుగా పనిచేయడానికి వీలుగా కార్యదర్శి, సహాయ కార్యదర్శి, న్యాయ కార్యదర్శి, అకౌంట్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని సమాచార కమిషనర్లు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 900 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజలకు సమాచార హక్కు చట్టం గురించి వివరించామని తెలిపారు. అనంతరం ‘ఆర్‌టీఐ లిట్రసీ క్యాంప్స్ పుస్తకాన్ని’ జస్టిస్ రజని ఆవిష్కరించారు.