జీఎస్టీ నిబంధనల ప్రకారం ఔషధాల అమ్మకం
గుంటూరు మెడికల్: ఔషధ ఉత్పత్తులపై సవరించిన జీఎస్టీ నిబంధనల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ సహాయ సంచాకులు డి.లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమాత్రం ‘తగ్గిందేలే’ శీర్షిక పేరుతో బుధవారం జిల్లా పత్రికలో ప్రచురితమైన కథనంపై లక్ష్మణ్ స్పందించారు. తమ రాష్ట్ర కార్యాలయ సూచనల ప్రకారం సెప్టెంబరు 20న జిల్లాలోని కెమిస్టులు, డ్రగ్గిస్టులతో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కొత్త జీఎస్టీ నియమాలు, బిల్లింగ్ విధానాలు, ఇన్‌వాయిస్‌లపై సవరించిన ఎమ్మార్పీ ధరల ప్రకారం రిటైల్, హోల్‌సేల్ మందుల డీలర్లకు అవగాహన కల్పించామని ఆయన వివరించారు. బిల్లింగ్ స్టాఫ్‌వేర్‌లో సవరించిన జీఎస్టీ ధరలను సరిగా చేర్చాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు 21 మెడికల్ షాపులు, హాస్పిటల్స్‌లోని మందుల షాపుల్లో తనిఖీలు నిర్వహించారని ఆయన వెల్లడించారు. సదరు తనిఖీల్లో కొత్త జీఎస్టీ నియమాలు పాటిస్తున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు గుర్తించారని పేర్కొన్నారు. సవరించిన ఎమ్మార్పీని ఫార్మసీలు తిరిగి లేబుల్ చేయడమనేది డ్రగ్, కాస్మోటిక్ చట్టం 1940 కింద రూపొందించిన నిబంధనలు తయారీ, కార్యకలాపాల కిందకు వస్తుందని వివరించారు.