
ఉత్కంఠగా కొనసాగుతున్న చెస్ పోటీలు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 62వ నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఈ పోటీలు జరుగుతున్నాయి పదో రోజైన మంగళవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కై కలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఆట ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ చదరంగాన్ని బ్రెయిన్ గేమ్ అని కూడా అంటారన్నారు. నిజమైన విజయమంటే ప్రత్యర్థిని ఓడించడం మాత్రమే కాదని, మనలోని ఆలోచనా శక్తిని పెంచుకోవడమనిన అభిప్రాయపడ్డారు. ఏపీ నుంచి మొట్టమొదటి ఇంటర్నేషనల్ మాస్టర్ లంకా రవి మాట్లాడుతూ చదరంగం అనేది ఒక మేధో క్రీడ మాత్రమే కాకుండా, అనేక నైపుణ్యాలను నేర్పే వేదికన్నారు.
9వ రౌండ్ ఫలితాలు
తొమ్మిదో రౌండ్‌లో సంచలనాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు, మాజీ జాతీయ చాంపియన్లు కూడా ఇంటర్నేషనల్ మాస్టర్ల చేతిలో ఓటమిపాలయ్యారు. పీఎస్‌పీబీకి చెందిన జీఎం సశికిరణ్ కృష్ణన్ గెలుపు అవకాశాన్ని కోల్పోయినా 7.5 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. తమిళనాడుకు చెందిన జీఎం ఇనియన్ పి.ఎ., కేరళకు చెందిన ఐఎం గౌతమ్ కృష్ణ. హెచ్ కూడా అతనితో సమంగా లీడ్‌లో చేరారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండటంతో టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా మారింది. పీఎస్‌పీబీకి చెందిన టాప్ జీఎంలు సూర్యశేఖర్ గంగూలీ, అభిజిత్ గుప్తా, ఎస్‌పీ సేతురామన్ వరుసగా గోవా ఐఎం రిట్విజ్ పరాబ్, కేరళ ఐఎం గౌతమ్ కృష్ణ, తమిళనాడు ఐఎం మనిష్ ఆంటో క్రిస్టియానో చేతిలో ఓడిపోయారు.