
ముంచెత్తిన వాన
రోడ్ల పైకి చేరిన వర్షపు నీరు ప్రజల రాకపోకలకు ఆటంకం
మంగళగిరి టౌన్ : ఆదివారం రాత్రి మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు పడిన భారీ వర్షానికి నగరంలోని కాలువలు, డ్రైనేజీలు పొంగి, రోడ్లపైకి నీరు ప్రవహించింది. మంగళగిరి పట్టణ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నగరంలో పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీ నరసింహ కాలనీ, ఎన్‌ఆర్‌ఐ వై జంక్షన్ దగ్గర అండర్‌పాస్‌ల వద్ద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గౌతమ బుద్ధ రోడ్డు, రత్నాల చెరువు, ఎస్టీ కాలనీ, ఆల్ఫా సెంటర్ వద్ద డ్రెయిన్లు పొంగి నీరు రోడ్ల పైకి చేరింది. భరించలేని దుర్వాసనలో స్థానికులు ముక్కుమూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
తెనాలిలో కుండపోత వర్షం
తెనాలి అర్బన్: అల్పపీడనం ప్రభావంతో తెనాలిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉన్నప్పటికీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. రాత్రి పొద్దు పోయే వరకు కురుస్తూనే ఉంది. రోడ్డన్నీ జలమయం అయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కొంత సేదతీరారు.

ముంచెత్తిన వాన