
శ్రీ గురుభ్యో నమః !
ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయులు వృత్తి నిబద్ధతతో తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ కె.రత్న షీలామణి పేర్కొన్నారు. కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం మార్కెట్ సెంటర్లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 54 మంది ఉపాధ్యాయులను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రత్నషీలామణి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తన తల్లిదండ్రుల పేరుతో స్థాపించిన ట్రస్టు ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సావిత్రీబాయి పూలే పేరుతో ప్రతిభా పురస్కారాలు అందిస్తూ వారిని గౌరవించడం ఎంతో ముదాహమని తెలిపారు. కృత్రిమ మేధా సంపత్తి వంటి అభివృద్ధి సాధనాలు ఎన్ని వచ్చినా ఉపాధ్యాయులకు సాటి రావని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్, కేవీఆర్ అండ్ జయలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి మాట్లాడుతూ జాతి నిర్మాణ భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందని తెలిపారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యాభివద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ట్రస్ట్ ద్వారా గుర్తిస్తూ, వారిని గౌరవించడం బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, వీజీఎస్ పబ్లిషర్స్ అధినేత ఎస్.రామారావు, కె.విజయ కుమారి పాల్గొన్నారు.