
రేపు విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈనెల 7న విజయవాడ ధర్నా చౌక్‌లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు పిలుపునిచ్చారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్‌లో ఆదివారం జరిగిన సంఘ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ హామీల అమలుకు చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఋణాల మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు తదితర ఎన్నికల్లో ఇచ్చి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినప్పటికీ తాత్సారం చేయడంతో ఉపాధ్యాయలోకం ఆగ్రహంతో ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం మేరకు ఈనెల 7న తలపెట్టిన ‘చలో విజయవాడ’లో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంక్షేమాన్ని ప్రభుత్వం మరచిపోయిందని తెలిపారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించకుండా మరింత భారాన్ని మోపి మానసిక ఆందోళనకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర బకాయిలను చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. సమావేశంలో సీనియర్ నాయకులు పి.ప్రసాద్, పి.దిబ్బయ్య, పి.సుందర్‌రావు, మేడా శ్రీనివాస రావు, రాజశేఖర్ పాల్గొన్నారు.
ధర్నాను విజయవంతం చేయాలి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈనెల 7న విజయవాడలోని ధర్నా చౌక్‌లో తలపెట్టిన మహాధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ కె.నరసింహారావు ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడంతోపాటు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, పాత పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలను కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, సెలవుల డబ్బులు, అంత్యక్రియల ఖర్చు తదితర సౌలభ్యాలను చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఏటా రూ. 180 కోట్లు హెల్త్ కార్డుల కోసం చెల్లిస్తున్నప్పటికీ ఏ హాస్పిటల్లోనూ వాటిని అంగీకరించడం లేదని తెలిపారు. ప్లస్ టు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
విజయవంతం చేయాలని ఎస్టీయూ
జిల్లా అధ్యక్షుడు పెదబాబు పిలుపు