
పెరుగుతున్న హిందీ భాష ప్రాముఖ్యత
విశ్రాంత రిజిస్ట్రార్, రచయిత రావెల సాంబశివరావు హిందీ భాషా ప్రచార సేవకులకు పురస్కారాల ప్రదానం
తెనాలి: ఉపాధి అవకాశాలకు విదేశీ తలుపులు మూసుకుపోతున్న నేడు స్వదేశంలోనే ఉద్యోగాలను వెతుక్కోవాల్సి వస్తుందనీ, అప్పుడు హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజి స్ట్రార్, ప్రముఖ రచయిత రావెల సాంబశివరావు అభిప్రాయపడ్డారు. స్థానిక హిందీ ప్రేమి మండలి మహా విద్యాలయంలో ఏటా జరిగే గాంధీ జయంతి, బోయపాటి నాగేశ్వరరావు–సుభద్రాదేవి గురు దంపతుల 23వ వార్షిక గురుపీఠ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మహా విద్యాలయం ప్రాంగణంలోని మోటూరి సత్యనారాయణ స్మారక సభా వేదికపై జరిగిన సభకు రావెల సాంబశివరావు అధ్యక్షత వహించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆచార్యులు, రచయిత ప్రొఫెసర్ నారాయణ, కాకినాడకు చెందిన విశ్రాంత హిందీ అధ్యాపకురాలు, రచయిత్రి షేక్ కాశింబీకి గురుపీఠ పురస్కారాలు, నగదును ప్రదానం చేసి సత్కరించారు. సభాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ స్వదేశంలోనే ఉద్యోగాలకు మాతృభాష తెలుగుతో పాటు హిందీని నేర్చుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని సూచించారు. విజయవాడకు చెందిన బహు గ్రంథకర్త డాక్టర్ వెన్నా వల్లభరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగిడిన ప్రేమి మండలి పునీతమైందని తెలిపారు. సత్కారగ్ర హీతలైన ప్రొఫెసర్ నారాయణ షేక్ కాశింబీ మాట్లాడుతూ మాతృభాష తెలుగుతో పాటు హిందీని నేర్చుకోవడం మంచిదని సూచించారు. డాక్టర్ మురుకుట్ల మంజుల స్వాగతం పలుకగా, నాగళ్ల దుర్గా రఘురాం వందన సమర్పణ చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ ఈలప్రోలు శ్రీనివాసరావు, కస్తూరి పర్య వేక్షించారు.