
అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాల్సిందే..!
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్ కొల్లి శారదా మార్కెట్‌లోని షాపుల లీజు గడువు పూర్తికావడంతో ఆగస్టు 18, 19, 20వ తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించారు. ఒక్కో షాపును రూ.లక్షల్లో పాడుకుని దక్కించుకున్నారు. పాత లీజుదారులు పొన్నూరు రోడ్డు(బైపాస్) వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్‌లో షాపులు నిర్వహించుకుంటున్నారు. దీంతో మార్కెట్‌కు వచ్చే రైతులంతా అన్నపూర్ణ కాంప్లెక్స్‌కు వెళ్లడంతో మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
ఈ నెల 10లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు..
మార్కెట్‌లో ఉన్న 81 షాపులకు బహిరంగ వేలం పాట నిర్వహించగా కార్పొరేషన్‌కు రూ.ఆరు కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 81 షాపుల్లో 41 షాపులకు సంబంధించి కొత్తగా పాడుకున్న లీజుదారులు కార్పొరేషన్‌కు నాన్ రిఫండబుల్ గుడ్‌విల్ చెల్లించారు. ఈ క్రమంలో పాత లీజుదారులు కార్పొరేషన్ అధికారులు తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని హైకోర్టుకు వెళ్లడంతో కొత్త లీజుదారులు దక్కించుకున్న రేటుతో షాపులను రెండు నెలల పాటు నిర్వహించుకోవాలని ఆదేశించింది. దాని ప్రకారం అధికారులు పాత లీజుదారులకు తెలియజేసినప్పటికీ వారు దానికి కూడా అంగీకరించకుండా అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్దే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కొత్త లీజుదారులు ప్రైవేట్‌గా మార్కెట్‌ను నిర్వహించకూడదని, ఇతర తగిన ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పాత లీజుదారులకు షాక్ ఇస్తూ అన్నపూర్ణ కాంప్లెక్స్‌ను ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో పాత లీజుదారులు డైలామాలో పడ్డారు.
హైకోర్టు ఉత్తర్వులు ఫాలో అవుతారో లేదో..!
అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. వీరిని ఖాళీ చేయించేందుకు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత లీజుదారులకు ఎమ్మెల్యే సపోర్ట్, కొత్త లీజుదారులకు మంత్రి సపోర్ట్ ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం కావడంతో.. ఎవరికి సపోర్ట్‌గా వ్యవహరిస్తే రాజకీయంగా ఎటువంటి సమస్యలు వస్తాయో అని అధికారులు సందిగ్గంలో ఉన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు అన్నపూర్ణ కాంప్లెక్స్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి నోటీసులు జారీ చేస్తున్నాం. ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తాం.
– డి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్–1