
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం – 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారితోపాటు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ వయో వృద్ధుల సమస్యలను సాధ్యమైనంతవరకు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వృద్ధుల అనుభవాలు చాలా గొప్పవి..
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వారి నుంచి స్పూర్తి పొందాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ జి. ప్రకాష్ రెడ్డి, డీఆర్‌ఓ ఎన్‌ఎస్‌కే ఖాజావలి, ఏడీ దుర్గాబాయి పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి