
మహనీయుల చరిత్రను తెలిపే ‘సదాస్మరామి’
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): తెలుగు భాషకు, సంస్కృతికి, చరిత్రకు, కళలకు, వన్నెతెచ్చిన మహనీయుల చరిత్రలను సమగ్రంగా, సంగ్రహంగా గ్రంథస్థం చేసి వర్తమాన భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం చేసిన గ్రంథకర్త మండలి బుద్ధప్రసాద్ అభినందనీయులని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రచించగా మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వెలువరించిన సదాస్మరామి పుస్తకావిష్కరణ సభ నగరంపాలెం కలెక్టర్ బంగ్లా రోడ్‌లోని భారతీయ విద్యాభవన్‌లో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను తెలుసుకునే అవకాశం సదాస్మరామి పుస్తకం ఇస్తుందని పేర్కొన్నారు. పుస్తక రచయిత, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల గురించి రాయడం తన అదృష్టమన్నారు. దాన్ని వెలువరించిన బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎం.నాగేశ్వరరావు, న్యాయమూర్తి జగదీశ్వరి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.