
అమెరికా వైద్యులు
జీజీహెచ్‌లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్న విదేశీ వైద్యులు
ప్రత్యేక వైద్య పరికరాలు సైతం అక్కడినుంచే..
●
కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ కడియాల సమత విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదివి నేడు అమెరికాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఆమె వద్దకు చికిత్స కోసం వచ్చే వారిలో ఎక్కువ మంది గర్భాశయ క్యాన్సర్ బాధితులు ఉండటం గమనించారు. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలో పరిస్థితి చూసి ఆశ్చర్యపోయి ఇక భారతదేశంలో ఎంతో మంది అమాయక మహిళలు క్యాన్సర్‌కు బలవుతుంటారని ఆలోచించారు. ఇండియాలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించి ప్రాణాలు పోకుండా కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఆమె మహా సంకల్పానికి పింక్ అనే ఎన్‌ఓజీ సంస్థ సహకారం అందించింది. అమెరికాలో తనతోపాటుగా పనిచేస్తున్న డాక్టర్ జీన్‌టాల్బర్ట్, డాక్టర్ కారోల్ హాబాక్‌లు ఇండియాకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో స్నేహితుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్( ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ సూచనలతో డాక్టర్ సుమత కడియాల సోమవారం గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం వరకు ఉచిత క్యాన్సర్ వైద్యశిబిరం జరగనుంది.
ముందస్తుగా నమోదు చేయించుకోవాలి...
ఈనెల 25 వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని నాట్కో క్యాన్సర్ సెంటర్ సమన్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్ తెలిపారు. అంతర్జాతీయ వైద్య నిపుణులు ఉచితంగా గుంటూరు వచ్చి పరీక్షలు చేస్తున్న దృష్ట్యా 21 నుంచి 60 ఏళ్లు మహిళలు ప్రతి ఒక్కరు ఈ ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందస్తుగా పేర్లు నమోదు చేయించుకో వాలని పేర్లు నమోదు కోసం స్టాఫ్ నర్సు అంజమ్మను 9640102066 నెంబరులో సంప్రదించాలన్నారు.
క్యాన్సర్ నిర్ధారణతో పాటుగా చికిత్స సైతం ..
అత్యాధునిక వైద్య పరికరాలతో క్యాన్సర్ నిర్ధారణ
గురువారం వరకు కొనసాగనున్న స్క్రీనింగ్ క్యాంపు
21 నుంచి 60 ఏళ్లలోపు మహిళలు పరీక్షలు చేయించుకోవాలని సూచన
ఆ మహిళలు అమెరికాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వైద్యులు. రెండు చేతులా సంపాదన ఉన్నా మనసులో ఏదో తెలియని అసంతృప్తి. ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి చికిత్స కోసం రావటం వారి మనసును కలిచి వేసింది. ముఖ్యంగా మహిళలు చిన్న వయస్సులోనే క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోవటం చూసి చలించిపోయారు. తమ వంతుగా క్యాన్సర్ నివారణకు ఏమైనా చేయాలని కంకణం కట్టుకున్నారు. వీరికి ఒక ఎన్‌జీఓ సహకారం అందించింది. దీంతో క్యాన్సర్‌పై సమరం చేసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది పేదలు ఉంటారని, చికిత్సలు చేయించుకోకుండా, కనీసం వ్యాధి నిర్ధారణ కూడా చేయించుకోక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తెలుసుకుని ఇండియాలో క్యాన్సర్ చికిత్సలు ఉచితంగా చేసేందుకు కదలి వచ్చారు. – గుంటూరు మెడికల్
గర్భాశయ క్యాన్సర్‌ను చాలా త్వరగా గుర్తించి(ప్రాథమిక దశలో) చికిత్స కూడా వెంటనే అందించే అత్యాధునిక వైద్య పరికరాలను సైతం డాక్టర్ కడియాల సమత గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఒక పక్క పేద రోగులకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య పరీక్షలు చేస్తూనే మరో పక్క యువ వైద్యులకు సైతం అత్యాధునిక క్యాన్సర్ వైద్య పరికరాలు ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలపై సైతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్య పరికరాలు, వైద్య సౌకర్యాలు నాట్కో ట్రస్ట్ గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసింది. దీంతో క్యాన్సర్ చికిత్సలు కూడా తక్షణమే చేసేలా అమెరికా నుంచి వచ్చిన వైద్యులకు వెసులుబాటు కలిగింది.

అమెరికా వైద్యులు