కొల్లూరు/ భట్టిప్రోలు: కృష్ణానదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. క్రమక్రమంగా నదిలో నీటి మట్టం ఎక్కువ అవుతోంది. మంగళవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 3,97,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ ఎగువనున్న ప్రాజెక్టులతోపాటు తెలంగాణ ప్రాంతంలోని మున్నేరు, ఇతర వాగులు నుంచి వరద నీరు అధికంగా వస్తోంది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నదిలో గణనీయంగా వరద నీరు పెరుగుతుండటంతో పెసర్లంక నక్కపాయ గండి, పోతార్లంక – గాజుల్లంక ప్రాంతాలలోని చిన్నరేవు, నది ఒడ్డుకు ఏర్పడిన కోతల ద్వారా వరద నీరు భారీగా లోతట్టు ప్రాంతాలలోకి ప్రవేశించి గ్రామాలను చుట్టుముట్టింది. వరద తీవ్రత అధికమవుతుండటంతో చింతర్లంక, పోతార్లంక, గాజుల్లంక, దోనేపూడి కరకట్ట దిగువున ఉన్న పంట పొలాలలో సాగులో ఉన్న అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు ముంపు బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. కొల్లూరు, గాజుల్లంక, పెసర్లంక ప్రాంతాలలోని పల్లపు భూములలోకి వరద నీరు చేరడంతో ఇటుక బట్టీలు ముంపునకు గురయ్యాయి. దోనేపూడి చినరేవు చప్టా పై నుంచి వరద నీటి ప్రవాహం అధికమవడంతో మండలంలోని 10 గ్రామాలకు చెందిన ప్రజలు గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. వరద తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు నది తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నదిలోకి పశువుల కాపరులు దిగరాదని, పిల్లలను నది వద్ద వెళ్లనీయకూడదని, ఈతకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. కొల్లూరు మండలంలోని వరద ప్రభావిత 21 గ్రామాలలో ఉన్న ప్రజల కోసం 13 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. కొల్లూరులో 8, అనంతవరం, చిలుమూరు, ఈపూరు, దోనేపూడి, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామాలలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో వీటిని సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
కలెక్టర్‌కూ తప్పని ‘కరకట్ట’ కష్టం
కరకట్ట ప్రయాణ కష్టాలు జిల్లా కలెక్టర్‌కు సైతం తప్పలేదు. కొల్లూరు వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర కరకట్ట మార్గం పూర్తిగా దెబ్బతింది. నిరంతరం ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ మార్గంలో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇరువైపులా సుమారు 15 అడుగుల లోతట్టు ప్రాంతం, పశ్చిమ బ్యాంక్ కెనాల్‌తో ఉన్న మార్గంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలసిపోయే ప్రమాదం వెన్నాడుతోంది. రహదారి అధ్వానంగా మారడంతో ఎదురుగా ఏదైనా వాహనం వస్తే పక్కకు తప్పుకొనే అవకాశం సైతం లేదు. మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ కొల్లూరు కరకట్ట ప్రాంతానికి రావడంతో వాహనం ముందుకు సాగడానికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది.
నదిలో క్రమక్రమంగా
పెరుగుతున్న నీటి ప్రవాహం
మొదటి ప్రమాద హెచ్చరిక
జారీ చేసిన అధికారులు
లోతట్టు ప్రాంతాలలోకి
భారీగా చేరిన వరద నీరు
ముంపు ప్రాంత ప్రజల కోసం
పునరావాస కేంద్రాలు సిద్ధం
క్షేత్రస్థాయిలో పర్యటించిన
బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్
సహాయక చర్యలపై అధికారులు,
సర్పంచ్‌లతో సమావేశం