
పేద విద్యార్థులకు ఆధునిక విద్యే లక్ష్యం
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వినూత్నంగా ఆధునిక విద్యాబోధన అందించటం టీచ్ ఫర్ చేంజ్ సంస్థ లక్ష్యమని టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ధరణికోట మండల పరిషత్ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ, పెగాసెస్ సిస్టమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ 3,4,5 తరగతుల విద్యార్థులకు ఆధునికంగా వచ్చిన మార్పులతో కూడిన విద్యను బోధించాలన్నారు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు దీటుగా విద్యాబోధన ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని తీర్చటానికి టీచ్ ఫర్ చేంజ్ సంస్థ పని చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 1,70,000 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా స్మార్ట్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశామని అందులో అమరావతి మండలంలో 10 గ్రామాలలోని పాఠశాలల్లో తమ సంస్థద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం స్మార్ట్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పెగాసెస్ సిస్టమ్స్ అధినేత హెచ్.ధరణి తో పాటుగా ఎంపీడీఓ పార్వతి, ఎంఈఓలు శివబాబు, కంచర్లప్రసాద్లతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తొలుత మంచు లక్ష్మి అమరావతి బాలచాముండికా సమేత అమరేశ్వరుని దర్శించుకుని స్వామివారికి,అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
సినీ నటి, టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి