
ప్రతిభావంతులను చదివించడం సామాజిక బాధ్యత
బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి అవోపా ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.45 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ
గుంటూరు ఎడ్యుకేషన్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను చదివించడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి తెలిపారు. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) ఏపీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మార్కెట్ సెంటర్లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 240 మంది విద్యార్థులకు రూ.45 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవోపా రాష్ట అధ్యక్షుడు తటవర్తి రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి మాట్లాడుతూ దాతల సహాయంతో విద్యార్థులు చక్కగా చదువుకోవాలని తెలిపారు. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుని, ఉద్యోగాల కోసం అన్వేషించకుండా వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. అవోపా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గార్లపాటి సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం మరింత మంది దాతల సహకారంతో పెద్ద సంఖ్యలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు కోటి రూపాయలను ఉపకార వేతనాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అవోపా నగర అధ్యక్షుడు కేవీ బ్రహ్మం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఈవోపా ప్రతినిధులు నాగేశ్వరరావు, పువ్వాడ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, పొట్టి శ్రీరాములు. చింతా కృష్ణారావు, రాష్ట్ర మహిళా విభాగ చైర్మన్ నిర్మల, రాధాకృష్ణయ్య, మహంకాళి శ్రీనివాసరావు, మద్ది సాయి రమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.