
భారతదేశపు గొప్ప ఇంజనీరింగ్ మేధావి, భారత రత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ తేదీని దేశం మొత్తం ఇంజనీర్స్ డేను నిర్వహించుకుంటుండడం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్నో త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారాయన.
ఎన్నో త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.#EngineersDay pic.twitter.com/rRnUXMOMQd
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2025
మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. పుణేలో సివిల్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసిన మోక్షగుండం.. బొంబాయ్ ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించి, ఖడక్‌వాస్లా, గ్వాలియర్, కృష్ణరాజసాగర్ డ్యామ్‌లలో విజయవంతంగా అమలు చేశారు. 1912–1918 మధ్య మైసూరు సంస్థానానికి ఇంజనీర్ మోక్షగుండం దివానుగా పనిచేశారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, ఐరన్ & స్టీల్ కంపెనీ వంటి సంస్థల స్థాపనలో కీలక పాత్ర వహించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన అందించిన సేవలకుగానూ 1955లో అప్పటి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. అంతేకాదు.. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి Knight Commander of the Indian Empire (KCIE) బిరుదు కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య పొందారు. భారత ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినం సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం.
