
దొంగలు.. బాబోయ్ దొంగలు
వరుస చోరీలతో గుంటూరు నగర ప్రజలు బెంబేలు పెరిగిన బైక్ చోరీలు మొద్దనిద్రలో పోలీసులు అలంకారప్రాయంగా మారిన సీసీఎస్ భారీ చోరీల్లో సైతం నో రిక ‘‘వర్రీ’’
పట్నంబజారు: నగరంలో రోజురోజుకీ చోరీలు పెరిగిపోతున్నాయి. దొంగలు అడ్డూఅదుపు లేకుండా నివాసాలు కొల్లగొడుతున్నా పోలీసులు మొద్దునిద్ర వీడటం లేదు. బాధితులు లబోదిబోమంటున్నారు. స్టేషన్‌కు వెళుతున్నా అదిగో చూస్తాం.. ఇదిగో చేస్తాం! అని చెప్పటం తప్పా, చోరీ ఘటనలపై పట్టించుకుంటున్న పాపాన పోవటం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
సీసీఎస్ నిస్తేజం
చోరీల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) సైతం అలంకారప్రాయంగా మారింది.. ఇటీవల రెండు చోరీలను మాత్రమే ఛేదించారు. విద్యానగర్‌లో కాకాని చెందిన వ్యక్తి చేసిన చోరీ, ఒక చైన్ స్నాచింగ్ ముఠాను మాత్రమే పట్టుకున్నారు. ఈ రెండు ఘటనల్లో ఒకే టీం వారిని పట్టుకున్నారని తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు సుమారు 50 మంది వరకు సీసీఎస్‌కు కేటాయించినప్పటికీ ఫలితం లేదు. వివిధ రకాల అటాచ్‌మెంట్‌లు, సీసీఎస్ అధికారులకు కావాల్సిన వారిని పిలించుకుని అక్కడ పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ విధంగా వ్యవహరిస్తే , చోరీలు నియంత్రణ ఎలా సాధ్యపడుతుందనే వాదనలు వినవస్తున్నాయి. ఇప్పుడు సీసీఎస్ స్టేషన్‌లో 20 నుంచి 25 మంది వరకు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారని తెలుస్తోంది. చిన్నాచితకా చోరీల్లో నిందితులను తప్పా భారీ కేసుల్లో సీసీఎస్ అధికారులు, సిబ్బంది కూడా ఎటువంటి పురోగతి సాధించలేకపోతున్నారు.
గస్తీకి సుస్తీ
పోలీసుల గస్తీకి సుస్తీ చేయడంతోనే చోరీలు అధికమైపోయాయని వాదనలు లేకపోలేదు. పాత గుంటూరు పరిధిలో రెండు రోజుల వ్యవధిలో మూడు భారీ చోరీలు, పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలో ఒకే రోజులో విద్యానగర్‌లో రెండు భారీ చోరీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. విద్యానగర్‌లో జరిగిన రెండు చోరీల్లో ఒక దానిలో అనుమానితులను బాధితులు స్పష్టంగా తెలియజేయడంతో త్వరితగతిన పట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. రాత్రిపూట సరిగా గస్తీ లేకపోవటం వలనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
●గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలోని సత్యనారాయణస్వామి గుడి బజారులో నివసించే పర్వతం దివ్య, శ్రీరామచంద్రం గత నెల 7న కుటుంబాలతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి రెండు రోజుల తరువాత ఇంటికి వచ్చారు. తలుపులు పగులకొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా దివ్య నివాసంలో 82 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, శ్రీరామచంద్రం నివాసంలో 42 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి వస్తువుల చోరీకి గురయ్యాయి.
●తమ్మా రంగారెడ్డి నగర్‌లో నివాసం ఉండే సరస్వతి పనులు నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రానికి వచ్చారు. పట్టపగలే ఆమె నివాసంలో సుమారు 100 గ్రామలు బంగారం, రూ 10లక్షల నగదు పోయింది. కేసు నమోదు చేసి నెలరోజులపైనే అవుతున్నా అడుగు కూడా ముందుకు కదలలేదు.
●ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక ఎన్నారై మహిళ బ్యాగ్‌ను అపహరించుకుపోయారు. అందులో భారీగా నగలు, నగదు ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేసినా ఇంత వరకు అతీగతీ లేకుండా పోయింది. విడ్డూరం ఏమిటంటే..ఆర్టీసీ బస్టాండ్‌లో చోరీ చేస్తూ పట్టుబడిన మహిళలను సిబ్బంది అప్పజెప్పిన క్రమంలో ఎటువంటి ఫిర్యాదు లేదని, వారిని వదిలేసిన సంఘటన పాతగుంటూరు పోలీసుస్టేషన్‌లో చోటు చేసుకుంది.
●కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్ వద్ద నివాసం ఉండే ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగుల నివాసంలో చోరీ జరిగి ఆరు నెలల పైనే గడుస్తోంది. 300 గ్రాముల బంగారం, భారీ నగదును దొంగలు దోచుకుపోయారు. ఇప్పటి వరకు కేసులో కనీస పురోగతి లేకపోవడంపై పోలీసుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ క్రైం సిబ్బంది ఉన్నా లేనట్టేనని.. వారికి మిగతా వ్యవహారాల్లో పనులు అధికమైపోయాయని ఆ స్టేషన్ సిబ్బందే బాహటంగా విమర్శిస్తున్నారు.
●గుంటూరు వెస్ట్ పరిధిలోని విద్యానగర్‌లో ఒక జైన్ వ్యాపారి నివాసంలో భారీ చోరీ జరిగింది. సుమారుగా 1200 గ్రాముల బంగారం, నగదు పోయిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయినప్పటీకీ ఇంత వరకు రికవరీ జరగలేదు.
●నల్లపాడు పోలీసుస్టేషన్ పరిధిలో సైతం ఒక నివాసంలో అరకిలోకు పైగా బంగారం చోరీ జరిగిన ఘటన చోటు చేసుకున్నా, ఇంత వరకు ఎటువంటి ముందడుగు లేకుండా పోయింది.
క్రైం పార్టీలను ఏర్పాటు చేస్తాం
ప్రత్యేక క్రైం పార్టీలను ఏర్పాటు చేసి జరిగిన చోరీలను ఛేదించేందుకు దృష్టి సారిస్తాం. పలు బందోబస్తులు కారణంగా సిబ్బంది అందుబాటులో లేరు. త్వరితగతిన నిందితులను పట్టుకుని సొత్తు రికవరీ చేస్తాం.
– షేక్ అబ్దుల్ అజీజ్ (డీఎస్పీ, గుంటూరు ఈస్ట్)
దొంగల స్వైరవిహారం