
యురేనియం కాలుష్యంపై ఆందోళన వద్దు: కలెక్టర్
గుంటూరు రూరల్: తురకపాలెంలో యురేనియం కాలుష్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తురకపాలెంలో ఇటీవల మరణాలు సంభవించిన నేపథ్యంలో సెకండరీ హెల్త్ సంచాలకురాలు డాక్టర్ సిరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ గ్రామాన్ని సందర్శించిందన్నారు. గ్రామంలోని నేల, నీటి నమూనాలను సేకరించి కాలుష్య కారణాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించారని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో ఎనిమిది నీటి శాంపిళ్లను కమ్యూనిటీ వాటర్ సోర్సులు, మరణించిన వారి ఇళ్ల బోరు బావుల నుంచి సేకరించారని ఆమె తెలిపారు. వీటిలో బయాలజికల్ కాలుష్యం తేలిందని వెల్లడించారు. కొన్ని నమూనాలలో ఏరోబిక్ మైక్రోబయల్ కౌంట్ 4000 సీఎఫ్‌యూ/ఎంఎల్ నుంచి 9000 సీఎఫ్‌యూ/ఎంఎల్ వరకు నమోదైందని వివరించారు. కొన్ని మీడియా కథనాల్లో తురకపాలెం భూగర్భ జలాల్లో యురేనియం కలుషితం ఉందని పేర్కొనడం జరిగిందని పేర్కొన్నారు. తాగునీటిలో యురేనియం పరిమితి భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం లీటరుకు 30 మైక్రో గ్రాములు (0.03 ఎంజీ)గా ఉందన్నారు. అదనంగా, పరమాణు శక్తి నియంత్రణ మండలి (ఏఈఆర్‌బీ) అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని లీటరుకు 60 మైక్రో గ్రాములు (0.06 ఎంజీ) వరకు పరిమితిని సూచిస్తోందని వెల్లడించారు.
పరిమితికి లోపలే నమోదు
తురకపాలెంలో సేకరించిన ఎనిమిది నీటి నమూనాల్లో నాలుగింటిలో యురేనియం ఆనవాళ్లు అనుమతించిన పరిమితి లోపలే నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బీ–2 శాంపిల్ – 0.001 మైక్రోగ్రాములు, బీ–4 శాంపిల్ 0.013 మైక్రో గ్రాములు, బీ–5 శాంపిల్ – 0.011 మైక్రో గ్రాములు, బీ –6 శాంపిల్ 0.005 మైక్రోగ్రాములు వరకూ నమోదయ్యాయని వివరించారు. మిగిలిన నాలుగు నమూనాల్లో యురేనియం ఆనవాళ్లు 0.001 మైక్రో గ్రాముల కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందని వివరించారు.