
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
నగరంపాలెం: శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఆదివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హాలులో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఏదైనా నేరం జరిగితే వెంటనే స్పందించాలని, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, సంఘ విద్రోహశక్తులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, వారి కదలికలు, జీవన విధానంతో పాటు ఏవైనా అనుమానాలు తలెత్తితే తక్షణమే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. పేకాట, కోడి పందేలు, మట్కా, సింగిల్ నంబర్ జూదాలను అరికట్టాలని తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని, వారితో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. చట్ట పరిధిలో వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్లలో ఎక్కువసేపు కూర్చోపెట్టొద్దని తెలిపారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జనరల్ డైరీ, రఫ్ డ్యూటీ రోస్టర్, ప్రాపర్టీ రిజిస్టర్, కేసు డైరీ ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలు, వార్డుల్లో కానిస్టేబుళ్లకు విధులు కేటాయించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ డ్రైవ్, కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), రవికుమార్ (ఎల్/ఓ), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్పీ
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్