
మహిళల ఆర్థికాభివృద్ధికి సహకారం
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందే ఆర్థిక చేయూత ద్వారా మహిళలు ఆర్థికవృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ వెలుగు ఆధ్వర్యంలో జీవనోపాధి కార్యక్రమాలు, ప్రణాళిక అమలుపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాల జీవనోపాధి మెరుగుదల కోసం ప్రభుత్వ శాఖలు ప్రతిష్ట విధానాలు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాయితీలతో అనేక పథకాలు అందిస్తుందన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటుకు న్యాచురల్ ఫార్మింగ్ తదితర లాభదాయక వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేలా క్షేత్ర స్థాయిలో అధికారులు మహిళలను ప్రొత్సహించాలన్నారు.
● డీఆర్‌డీఏ పీడీ పి.వి.విజయలక్ష్మి మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల సభ్యులకు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న స్కీమ్స్, సబ్సిడీ స్కీమ్‌లపై అవగాహన కల్పిస్తే జీవనోపాధి మరింత మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుందన్నారు. కొలకలూరులో ఇండస్ట్రీయల్ పార్కు నిర్మించేందుకు దాత ఎకరం పొలం ఉచితంగా అందించారన్నారు. దీనిలో ఏపీఐఏసీ సహకారంతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫిరంగిపురంలో గతంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ మాదిరిగా మిగిలిన అన్ని మండలాల్లో కూడా మార్ట్‌లు ఓపెన్ చేస్తామన్నారు. డీఆర్‌డీఏ ద్వారా జిల్లాలో ఎస్‌హెచ్‌జీ మహిళలు అందించిన ఆర్థిక సహాయంతో సాంఘీక సంక్షేమ నిధికి రూ. 6.41 లక్షల నమూనా చెక్కును అధికారి గుణశీలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, నాబార్డు డీడీఎం శరత్‌బాబు, డ్వామా పీడీ శంకర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.