
బడ్జెట్‌లలో చేనేతకు మొండిచేయి
సత్తెనపల్లి: చేనేతకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిని ఫణిదం చేనేత సహకార సంఘం భవన ఆవరణలో బుధవారం జరిగిన చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా 3వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాసభకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు అధ్యక్షత వహించారు. బాలకష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చేనేతకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్లూమ్స్, జెట్లూమ్స్‌లను ప్రోత్సహిస్తూ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై అక్టోబర్ 6,7 తేదీలలో సత్తెనపల్లిలో జరిగే చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభ లలో చర్చించి కార్యచరణ ప్రణాళికను రూపొందించి భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ముందుగా చేనేత జెండాను చేనేత జాతీయ అవార్డు గ్రహీత కర్నాటి మురళి, సామాజిక సేవా కార్యకర్త గంజి వీరాస్వామి, పణిదం చేనేత సొసైటీ కార్మికురాలు మంచి మల్లేశ్వరి లు ఆవిష్కరించారు. మహాసభలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుములు వీరబ్రహ్మం కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం నివేదికపై మహాసభలో ప్రతినిధుల చర్చించి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. భవిష్యత్ కర్తవ్యాల కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. మహసభలో చేనేత కార్మిక సంఘ నాయకులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి
పిల్లలమర్రి బాలకష్ణ