
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
పెదకాకాని(ఏఎన్‌యూ): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి 4వ స్పోర్ట్స్‌మీట్–2025 ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా మంత్రి సంధ్యారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ వైస్ చైర్మన్ ఎం. మల్లికార్జుననాయక్, ట్రైబల్ వెల్‌ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి, గురుకులం సెక్రటరీ గౌతమి, వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడాలని ఆలోచన వచ్చిందంటేనే పిల్లలు గెలిచినట్టన్నారు. రోజూ గంటకుపైగా ఆడుకోవడం ద్వారా శారీరక సామర్థ్యం పెరుగుతుందన్నారు. గురుకులం సెక్రటరీ గౌతమి మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 5వ తేది వరకు బాలికలు, 7 నుంచి 9వ తేదీ వరకూ బాలురకు 12 అంశాల్లో క్రీడలు ఉంటాయని చెప్పారు. 13 జిల్లాల నుంచి 656 మంది హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి విద్యార్థుల నుంచి క్రీడావందనం స్వీకరించారు.
వసతులు కరువు
1500 మంది క్రీడాకారులతో నిర్వహించడానికి అనుకూలంగా వసతులు లేని కారణంగా బాలికలు, బాలురకు వేర్వేరు తేదీల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. వర్సిటీలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, టేబుల్‌టెన్నిస్, తైక్వాండో, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ ఆఫీసర్ శ్యాంసుందర్ వివరించారు. ముందుగా జాతీయ జెండా, స్పోర్ట్స్ జెండా, ఈఎంఆర్‌ఎస్ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి 800 మీటర్లు పరుగుపందెం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు, రిజిస్ట్రార్ సింహాచలం, పలువురు స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులకు మంత్రి
గుమ్మడి సంధ్యారాణి సూచన
ఘనంగా గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభం