
ఉమేష్ చంద్రకు ఘన నివాళి
తెనాలి రూరల్: దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర 26వ వర్ధంతిని గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సబ్ డివిజన్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆయన చూపిన అంకిత భావం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాంఘిక శక్తులపై ఉమేష్ చంద్ర ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. నిజాయతీ కలిగిన అధికారిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమేష్ చంద్ర సతీమణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, డీఎస్పీ బి. జనార్ధనరావు, సీఐలు వి. మల్లికార్జునరావు, రాములనాయక్, ఎస్. రమే ష్‌బాబు, ఆర్. ఉమేష్, సబ్ డివిజన్‌లోని ఎస్‌ఐలు సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ముందుగా ఉమేష్‌చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.