
దాతల సహకారం అభినందనీయం
కారంచేడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు అదృష్టవంతులని డీఈఓ ఎస్.పురుషోత్తం పేర్కొన్నారు. స్థానిక యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కారంచేడులోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామానికి చెందిన అనేక మంది ఎన్నారైలు, పాఠశాలల పూర్వ విద్కార్థులు చేతులు కలపడం మంచి పరిణామమని కొనియాడారు. గ్రామంలోని వైఎన్ ప్రభుత్వ పాఠశాలను దాతల సహకారంతో రూ. 12 లక్షలతో అభివృద్ధి చేశారని తెలిపారు. అమెరికాలోని డల్లాస్ పట్టణంలో స్థిరపడిన గ్రామానికి చెందిన రాయినీడి మురళీకృష్ణ సహకారంతో రూ. 33 లక్షలతో నూతనంగా బస్సును కొనుగోలు చేసి ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఉన్నత పాఠశాల వరకు ఉన్న 360 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులను గ్రామానికి చెందిన హైదరాబాద్‌లోని స్మైల్ ఫౌండేషన్ నిర్వాహకులు గౌర అనీల్‌కుమార్ సమకూర్చగా, వాటిని కూడా ఆయన చేతుల మీదుగా అందించారు. ఎన్నారై ఘంటా పద్మజ మాట్లాడుతూ తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థినేనని తెలిపారు. అవిభక్త పిల్లల వైద్యులు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో పేరు నమోదు చేసుకున్న డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ కూడా ఈ పాఠశాల విద్యార్థే అని గుర్తు చేశారు. వేసవి తరగతులు నిర్వహించిన పావులూరి శ్రీనివాసరావు, పొదిలి మురళీకృష్ణలను సత్కరించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ యార్లగడ్డ రాఘవయ్య, చుండూరి రామయ్య, పాఠశాల పూర్వ కరస్పాండెంట్ యార్లగడ్డ రఘుబాబు, ఎంఈఓ ఎం. వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం సామ్రాజ్యం పాల్గొన్నారు.
బాపట్ల డీఈఓ పురుషోత్తం