
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష తగదు
గుంటూరు వెస్ట్: ఎయిడ్స్ బారినపడకుండా ఉండాలని అనుకోని పరిస్థితుల్లో ఈ వ్యాధికి గురైన వారిపట్ల వివక్షత చూపవద్దని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన హెచ్‌ఐవీని చర్చిద్దాం – నిర్మూలిద్దాం పోస్టర్‌ను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లి నుంచి శిశువుకు, కలుషితమైన సిరంజ్‌లు, రక్తమార్పిడి, జాగ్రత్తలు పాటించని లైంగిక సంబంధాల కారణంగా హెచ్‌ఐవీ సోకుతుందన్నారు. వ్యాధి సోకినా కూడా ప్రభుత్వం అనేక విధాలుగా రోగులను ఆదుకుంటుందని తెలిపారు. దీని బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
పేదల గృహాలు త్వరగా పూర్తి చేయాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్ధేశించిన 11,049 ఇళ్ల నిర్మాణాలను ఈనెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 15వ తేదీకల్లా మూడు లక్షల ఇళ్లు ఒకేసారి గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో ఇప్పటికే 7వేల గృహాలు పూర్తి చేశారని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని, హౌసింగ్ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. లే–అవుట్‌లలో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జేసీ ఎస్.భార్గవ్‌తేజ, డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, హౌసింగ్ పీడీ ప్రసాద్, డ్వామా పీడీ శంకర్, డీపీఓ సాయికుమార్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి