
కృష్ణా నదిలో వరద తగ్గుముఖం
కొల్లూరు : కృష్ణా నదికి వరద నీటి విడుదలను తగ్గిస్తుండటంతో వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీటి విడుదల తగ్గుతుండటంతో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలే నీటి పరిమాణం సైతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం 2.61 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసిన అధికారులు క్రమక్రమంగా ఎగువ నుంచి వచ్చి చేరే నీరు ఆధారంగా సముద్రంలోకి నీటి విడుదలను తగ్గించుకుంటూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి కృష్ణా నదికి వరద నీటి విడుదల 1.90 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎండుతున్న వరి నారుమడులు
నగరం: ఖరీఫ్ ఆరంభంలోనే రైతులు సాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. వరుణుడుపై భారం వేసి పోసిన నారును రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షాల రాకతో నియోజకవర్గంలోని నగరం, ఆరేపల్లి, సజ్జావారిపాలెం గ్రామాలలో వరి నారుమడులు పోశారు. ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో మొలకలు వచ్చిన నారుమళ్లకు నీరు కరువైంది. గాలులు వీయడంతో నారుమళ్లు వడ బడుతున్నాయి.

కృష్ణా నదిలో వరద తగ్గుముఖం