
అభాగ్యులకు పునర్జన్మ
అవయవదానం వల్ల మరొకరికి నూతన జీవితాన్ని ఇవ్వొచ్చు. భూమిపై లేకున్నా ఇతరుల్లో జీవించి ఉండొచ్చు. జిల్ల్లాలో పలువురు బ్రెయిన్‌డెడ్ అవుతున్నారు. అలాంటి వారి కుటుంబ సభ్యులకు అవగాహన పెంచడం ద్వారా ఎంతో మందికి నూతన జీవితాన్ని ప్రసాదించే వీలుంది. ఏటా ఆగస్టు 3న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
గుంటూరు మెడికల్: అవయవాలు అవసరమైన వారు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. దీనికి జీవన్‌దాన్ పేరిట సర్కారు ప్రత్యేక ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి జీవన్‌దాన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి కోసం పలువురు దరఖాస్తు చేసుకుని అవయవాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆపరేషను ఖర్చులు భరించలేక కూడా జీవన్‌దాన్ పథకంలో పేర్లు నమోదు చేయించుకోని వారు అధికంగానే ఉన్నట్లు సమాచారం. అవయవాల కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పలువురు ఎదురు చూస్తున్నారు. సకాలంలో వీరికి అవయవాలు లభించకపోతే ప్రాణాలు కోల్పోవాల్సిందే. మూఢ నమ్మకాలు, అవగాహనలోపంతో ఇప్పటికీ పలువురు అవయవదానానికి ముందుకు రావడం లేదు. తాము ఈ లోకంలో లేకున్నా మరొకరికి దానం చేసిన అవయవాల వలన సజీవంగా ఉండే గొప్ప అవకాశం ఇది. కుటుంబసభ్యులు కూడా ఆ సమయంలో బాధను తట్టుకుని ముందుకురావడంతో పలువురి ప్రాణాలు నిలిచాయి. అభాగ్యులకు పునర్జన్మ లభించడంతో వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి.
ఏవి దానం చేయవచ్చంటే..
మనిషి కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఇలా సేకరణకు ఐదు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులను అవసరమైన వారికి మూడు గంటల్లోగా అమర్చాలి. కాలేయాన్ని 5 నుంచి 8 గంటలలోపు, మూత్రపిండాలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాలి. కళ్లు చాలా కాలం నిల్వ చేయవచ్చు.
నమోదు చేసుకోవడం ఇలా...
ఎవరైనా దీనికి అంగీకరించే ముందు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసిన వారందరికీ అవయవ దానం చేస్తున్నట్లు చెప్పాలి. దీని వలన సదరు వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయితే త్వరగా అవయవాలు దానం చేసేందుకు వీలు కలుగుతుంది. www.jeevandan.ap.gov.in వెబ్‌సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం వారికి ఓ కార్డును అందజేస్తుంది.
అవయవాలు కావాల్సి వస్తే...
అవయవ మార్పిడి కోసం జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నెంబరు ఇస్తారు. అవయవదానం చేసేందుకు వెబ్‌సైట్‌లో సమాచారం ఇస్తే తక్షణమే సీరియల్ నెంబరు ప్రకారం అవయవాలు అమర్చేలా జీవన్‌దాన్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు.
అవయవ దానంతో నిలుస్తున్న విలువైన ప్రాణాలు రేపు జాతీయ అవయవ దాన దినోత్సవం

అభాగ్యులకు పునర్జన్మ