
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో అవసరమైన డేటాను రూపొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ) కార్యాచరణ ప్రణాళిక 2025–26 రూపకల్పనలో భాగంగా ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ పోర్టల్, ప్రగతి పోర్టల్‌పై మండల స్థాయిలోని సాంకేతిక సిబ్బందికి శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ టీఎంపీ, ప్రగతి పోర్టల్, ప్రగతి యాప్ వినియోగించే పద్ధతి, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణకు సంబంధించిన అంశాలను పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడంలో సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోస్ట్, ప్రీ అసెస్‌మెంట్, ఆధార్ ఆథెంటిఫికేషన్, ఈ–సర్టిఫికెట్ డౌన్‌లోడ్ వంటి అంశాలను పూర్తి చేసేందుకు ప్రతి ఉద్యోగికి శిక్షణ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు రవీంద్రబాబు, కె.నాగేశ్వరరావు, కరీముద్దీన్, అనురాధ, ఏవో ప్రతాప్ పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ జ్యోతిబసు