
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన కేరళ బృందం
కొల్లిపర: రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో కేరళకు చెందిన బృందం కొల్లిపర మండల పరిధిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఆదివారం సందర్శించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలో భాగంగా గుంటూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కొల్లిపర మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పంట పొలాల్లో క్షేత్ర సందర్శన ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయంలోని సార్వత్రిక సూత్రాలను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, సీనియర్ కన్సల్టెంట్ రామచంద్ర కేరళ బృందానికి వివరించారు.
● మహిళా రైతు వసంత పొలంలోని అరటి ఏ–గ్రేడ్ మోడల్, ఎనీ టైం మనీ మోడల్‌ను బృందం సందర్శించింది. ఏటీఎం మోడల్ సాగు విధానం, ఉపయోగాలు వివరించారు. బీజామృతం, ఘనజీవామృతం, ద్రవ జీవామృతం తయారీ, విత్తన ధ్రువీకరణ తదితర అంశాలను రైతులు కేరళ బృందం సభ్యులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రత్యక్షంగా తయారు చేసి చూపించారు. ప్రకృతి వ్యవసాయం, రసాయన వ్యవసాయ క్షేత్రాలలో బ్రిక్స్ విలువలను బృందం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉష్ణోగ్రత 31%గాను, రసాయన వ్యవసాయ క్షేత్రంలో 36%గాను నమోదైనట్లు తెలుసుకున్నారు.
● మహిళా రైతు మాణిక్యమ్మకు చెందిన పొలంలో ఏ–గ్రేడ్ మోడల్ పంటల్లో అరటి, కంద, కంది, పసుపు, బయోడైవర్సిటీ క్రాప్స్‌ను కేరళ బృందం సందర్శించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు ప్రయోగాత్మకంగా అధికారులు సమాధానమిచ్చారు.
● అనంతరం శ్రీలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన పొలంలో సూర్య మండల మోడల్‌ను సందర్శించారు. ఇందులో రోజూ ఒక్కొక్క రకమైన కూరగాయలు వచ్చే విధంగా పంటలు వేసుకున్నట్లు ఆమె వివరించారు.
● అన్నవరంలో రైతు సాంబయ్య పీఎండీఎస్ క్షేత్రాన్ని సందర్శించి, ప్రాధాన్యతను తెలుసుకున్నారు.
● బొమ్మువారిపాలెంలో ఉన్న బయో రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించారు. ఇక్కడ లిక్విడ్ పొటాషియం తయారు చేసుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. చివరగా మహిళా సంఘాల గ్రూపుతో ప్రకృతి వ్యవసాయ భాగస్వామ్యం గురించి చర్చించారు. కేరళ బృంద సభ్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సరోజ్ కుమార్ కృషి, విజ్ఞాన కేంద్రం కొల్లం, ఎఫ్‌ఎంటీ జాకబ్ థామస్, ఎఫ్‌ఎంటీ ఒమన్ కుమార్ పాల్గొన్నారు.