
డాక్టర్ హేమంత్‌కు అరుదైన గౌరవం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఉప్పుటూరి హేమంత్‌కు అరుదైన గౌరవం లభించింది. లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఆర్‌సీఎస్) ఆధ్వర్యంలో ఈనెల 9న జరిగిన ఇంటర్నేషనల్ సర్జికల్ ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లో (ఫెలోషిఫ్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్) ఫెలోషిప్, ఐఎస్‌టీపీ డిగ్రీని ఒకేసారి అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ ఉప్పుటూరి హేమంత్ చైన్నె రాయవెల్లూరులో క్రిస్టియన్ మెడికల్‌కాలేజ్‌లో న్యూరో సర్జరీ పీజీ పూర్తి చేశారు. బ్రిటిష్ న్యూరో సొసైటీ ఆంకాలజీ 2022లో డాక్టర్ హేమంత్‌ను ప్రోడీజీగా గుర్తించారు. ఫెలోషిప్ అందుకుని గుంటూరు విచ్చేసిన డాక్టర్ ఉప్పుటూరి హేమంత్‌ను సోమవారం గుంటూరు కొత్తపేటలోని అమృత హాస్పిటల్, యాంజివోకేర్ హాస్పిటల్, న్యూరో కేర్ హాస్పిటల్ వైద్యులు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మద్ది వినోద్‌కుమార్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉప్పుటూరి హేమంత్, డాక్టర్ మన్నె సింధూర, పలువురు వైద్య సిబ్బంది అభినందించారు. గుంటూరు ప్రాంత ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు డాక్టర్ హేమంత్ వెల్లడించారు. వైద్య రంగంలో తనకు లభించిన అరుదైన గౌరవంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని వెల్లడించారు.