కృష్ణమ్మకు గర్భశోకం | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మకు గర్భశోకం

May 11 2025 7:44 AM | Updated on May 11 2025 7:46 AM

ఇసుక మేట.. కాసుల వేట

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇసుక మేట...రూ.కోట్ల దోపిడీకి అందమైన పేరు. ఏనాడో కృష్ణా నదీ గర్భంలో కలిసిపోయిన భూములవి. అక్కడ పంటలు పండించేది లేదు. రూపాయి ఆదాయం వచ్చే అవకాశం అసలుండదు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీ నేతల కళ్లు ఆ భూములపై పడ్డాయి. ఎందుకూ పనికి రాని వాటిల్లో ఇసుక మేట పేరుతో కాసుల వేట సాగించవచ్చని యోచన చేశారు. పక్కా ప్రణాళికతో పావులు కదిపారు. రైతుల పేరుతో అనుమతులు చకచకా వచ్చాయి. నిబంధనలను తీసి గట్టునపెట్టారు. రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందులో అసలు రైతులకు దక్కింది నామమాత్రమే. మళ్లీ ఇప్పుడు అదే ఇసుకమేట పేరుతో దోపిడీకి తెరతీశారు.

ఇసుకాసురులకు వరప్రసాదం

తెనాలి నియోజకవర్గంలోని కృష్ణాతీరం లోని కొల్లిపర మండలం ఇసుకాసురులకు వరప్రసాదం. అధికారిక ఇసుక రీచ్‌లు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రణాళికలు రచిస్తారు. పేరు మాత్రమే ఉచితం. అన్నీ పక్కాగా, పకడ్బందీగా జరిగిపోతాయి. అధికార గణం ప్రేక్షకపాత్ర వహిస్తుంది. పత్రికల్లో వచ్చినపుడు హడావుడిగా అక్కడకు తనిఖీలకు వెళతారు. అప్పటికే గప్‌చుప్‌ మన్నట్టుగా అక్కడ అన్నీ సర్దేసుకుంటారు. మళ్లీ రెండురోజుల తర్వాత షరా మామూలే! సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేస్తారు. యంత్రాలతో ఇసుక తవ్వటం, బారీ డంపర్లలో 45 టన్నుల వరకు అధిక లోడింగ్‌తో రవాణా చేస్తుండటం కొల్లూరు మండలంలోని రీచ్‌లో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం.

రేపో మాపో అనుమతులు

ఇక రేపో మాపో ఇసుక మేట తొలగింపునకు అనుమతులు వచ్చేస్తాయి. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అనుమతులు పట్టా రైతు పేరిటే ఉంటాయి. అక్కడ ఇసుక తవ్వకాల నుంచి, అమ్మకాల వరకు అన్నీ అధికార పార్టీల నేతల దళారులే పర్యవేక్షిస్తారు. అనుమతి తీసుకున్న భూమిలోనే కాకుండా నదిలో సమీప ప్రాంతంలోనూ తవ్వుతారు. నిబంధనల ప్రకారం ఎకరాకు ఇన్ని క్యూబిక్‌ మీటర్ల చొప్పున మాత్రమే తవ్వాలని, అది కూడా ఇన్ని అడుగులకు లోతుకు మించి తవ్వరాదని స్పష్టంగా ఉంది. వాటిని ఏమాత్రం ఖాతరు చేయరు. నిలువెత్తు లోతులో యంత్రాలతో నదీ గర్భాన్ని కుళ్లబొడిచిన దాఖలాలు ఎన్నో!

తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు

అక్రమ తవ్వకాలపై పత్రికల్లో వచ్చినా మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేయడం మినహా చర్యలు లేవు. మళ్లీ ఇప్పుడు ఇసుకమేట పేరుతో రైతులు అనుమతులకు దరఖాస్తు చేయటంతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. ఇక అనుమతులు లాంఛనమే ! ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతాయో చూడాల్సి ఉంది. ఈసారైనా అధికారులు నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు జరిగేలా చూస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. 2014 నుంచి 2019 వరకూ ఎంతమందికి పట్టా భూముల్లో తవ్వారన్న విషయం మైనింగ్‌ అధికారుల వద్ద సమాచారం లేదని చెబుతున్నారు. ఫైల్‌ కనపడటం లేదని, వెతుకుతున్నామని

చెప్పడం గమనార్హం.

ప్రభుత్వానికి దరఖాస్తులు

మేట తొలగింపు పేరుతో పక్కా స్కెచ్‌

గతంలోనూ ఇదే రీతిలో కోట్లు

కొల్లగొట్టిన పచ్చ నేతలు

మళ్లీ అధికారంలోకి వచ్చాక

అదే తంతు

కృష్ణమ్మ గర్భాన్ని కుళ్లబొడిచి

ఇసుక తవ్వకాలు

ఇప్పటికే అధికార రీచ్‌ల్లో

యంత్రాలతో తవ్వకాలు, అధిక లోడింగ్‌

నిలువరించలేక చేతులెత్తేసిన

అధికార యంత్రాంగం

ఇసుక మేట తొలగింపులోనైనా

కనీసం నిబంధనలను పాటిస్తారా !

కొల్లిపర మండలంలో ఇటీవల వరకు మూడు రీచ్‌లు నడిచాయి. ప్రస్తుతం అధికారిక రీచ్‌లు లేవు. అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరు తగ్గింది. దీంతో గతంలో అమలుచేసిన ఇసుకమేట ప్రణాళిక గుర్తుకొచ్చింది. వెంటనే అమల్లోకి తెచ్చేశారు. కొల్లిపర మండలంలోని బొమ్మువానిపాలెం గ్రామ పరిధిలో కృష్ణానదిలో కలిసిపోయిన భూముల్లో ఇసుక మేట తొలగింపునకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు వెళ్లాయి. ఆ ప్రకారం 6,932 హెక్టార్లలో అంటే 17.33 ఎకరాల్లో 72,790 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకానికి ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఈనెల 6న బొమ్మువానిపాలెం వచ్చారు. అక్కడి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. రైతుల భూముల్లో ఇసుకమేట తొలగించుకుంటామంటే ఇతరులు ఎలా అభ్యంతర పెడతారు? సమావేశం సజావుగా జరిగింది. ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉందనుకుంటూ అధికారులు వెళ్లిపోయారు.

కృష్ణమ్మకు గర్భశోకం 1
1/1

కృష్ణమ్మకు గర్భశోకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement