
కూటమి ప్రభుత్వంలో కుట్టు మిషన్ల స్కాం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఎన్నో స్కాంలు జరిగాయని, తాజాగా బీసీ మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ పేరుతో రూ.150 కోట్ల స్కాం చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఆరోపించారు. బృందావన్ గార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణ తరగతులు కూడా ప్రభుత్వ భవనాల్లో పార్టీ కార్యకర్తల ద్వారా నిర్వహిస్తోందని తెలిపారు. శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపుతున్నారని మండిపడ్డారు. బీసీ మహిళలంటే ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో ఈ విషయం ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాలరావు మాట్లాడుతూ కుట్టు శిక్షణ సమయం కూడా 360 గంటల నుంచి 130 గంటలకు కుదించారని తెలిపారు. రాష్ట్ర కుమ్మర శాలివాహన విభాగ అధ్యక్షుడు మండేపూడి పురుషోత్తం మాట్లాడుతూ కూటమి పాలనలో ముడుపులు ఇచ్చిన కంపెనీలకు కుట్టు మిషన్ల కాంట్రాక్ట్ అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు పాలకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. సమావేశంలో బీసీ సంఘ ముఖ్య నాయకులు తాడిబోయిన సుబ్బారావు, మయకుంట్ల రాయప్ప, దానబోయిన నాగేశ్వరరావు, కుక్కల రాంప్రసాద్ పాల్గొన్నారు.