నీ బంటు నేనయ్య..
‘ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా.. ఉండ్రాళ్లు మీదికి నీ దండు పంపు’ అని ఆర్తిగా పిలిస్తే పలికే దైవం, ‘ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం / కళాధరావతంసకం విలాసి లోక రక్షకమ్’ అని నిండుగా ప్రార్థిస్తే ఇట్టే అనుగ్రహించే పార్వతీనందనుడు, సర్వగణాలకు అధిపతుడు విఘ్నేశ్వర స్వామి. శనివారం వినాయక చవితి. పిల్లా–పెద్దా అందరూ ఆనందంగా జరుపుకొనే పర్వదినం. ఏకవింశతి పత్రాలు, ఛత్రం, పాలవెల్లి.. ఇలా గణపయ్యకు ఇష్టమైనవన్నీ ఒక్కొక్కటీ శ్రద్ధగా సేకరించుకుని భక్తిగా వ్రతం ఆచరించే అపూర్వ సందర్భం నేడు. ఆఖరున ‘పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు సేవించి మాకు బుద్ధినిచ్చు.. ’అని మంగళ హారతులిచ్చి స్వామిని కొలిచే వేళ నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వరసిద్ధి వినాయక వ్రతానికి కావల్సిన పూజా సామగ్రి కొనుగోలుకు వచ్చిన భక్తులతో గుంటూరు నగరం పండుగ శోభను సంతరించుకుంది.
నీ బంటు నేనయ్య..
నీ బంటు నేనయ్య..


