గుంటూరు ఎడ్యుకేషన్: శుక్రవారం గుంటూరు నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌లోని హెలీప్యాడ్ వద్ద కలిసిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వివిధ అంశాలపై వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 1998–డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మానవతా దృక్పధంతో పోస్టింగ్స్ కల్పించడంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 6,800 క్వాలిఫైడ్స్‌లో 4,072 మందికి నియామకాలు కల్పించారని, మిగిలిన వారికి సైతం న్యాయం చేయాలని కోరారు.
టీడీపీ కార్యకర్తల దాడి
గుంటూరు ఈస్ట్: టీడీపీ నాయకుడు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి తెగబడ్డాడు. మధ్యలో అడ్డు వచ్చి వారించబోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కూడా ఈదాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అరండల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్‌సీపీ 51వ వార్డు ఇన్‌చార్జి చెన్నుపాటి శ్రీను గురువారం రాత్రి వసంతరాయపురం సాయిసుధ బార్ వద్ద ఉన్న తన కిళ్లిషాపును మూసివేస్తుండగా 55వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గంగుల నవీన్, గంజిగుంట వెంకటేశ్వరరావులు శ్రీను వద్దకు వచ్చా రు. మనకులం వాడివై ఉండి వైఎస్సార్‌సీపీలో ఉండటం ఏమిటి? టీడీపీలోకి మారమంటూ వాదులాటకు దిగారు. శ్రీను బావమరిది మాగంటి ప్రసాద్ వారించాడు. గంగుల నవీన్, అతని అనుచరులు చెన్నుపాటి శ్రీను, అతని బావమరిది ప్రసాద్‌లపై దాడిచేసివెళ్లిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నుపాటి శ్రీను, బావమరిది ప్రసాద్‌లు వసంతరాయపురం 1వలైనులోని కేబుల్ ఆఫీస్ వద్ద ఉండగా, టీడీపీ నాయకుడు గంగుల నవీన్, గంజిగుంట సాయి, గంజిగుంట వెంకటేశ్వర్లు మారణాయుధాలతో మరోసారి దాడికి పాల్పడ్డారు. సమీపంలో ఉన్న గజ్జల శివరామకృష్ణ మధ్యలో అడ్డువచ్చి వారించాడు. నవీన్ తన చేతిలోని స్క్రూడ్రైవ్‌తో శివరామకృష్ణ కణితపై పొడిచి పరారయ్యారు.