మట్టి దిబ్బ – మానవీయత

Vardelli Murali Article On Chandrababu Naidu At Amaravati - Sakshi

జనతంత్రం 

స్క్రిప్టు ముందుగానే సిద్ధమైంది. అందుకు తగ్గట్టు పక్కాగా ఏర్పాట్లు చేశారు. షూటింగ్‌ జరిగే ప్రదేశం ఉద్దండరాయుని పాలెం. రాజధానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన స్థలం. నిర్వాహకుల్లో ఉత్కంఠ. ఎలాగైనా సీన్‌ పండాలి. టీవీల్లో ఆ సీన్‌ చూసి జనంలో ఒక బలమైన ముద్ర పడాలి. అందుకోసం శిక్షణ పొందిన కెమెరామన్‌ను వినియోగించారు. అన్ని చానళ్లకు అతడి నుంచే ఫీడ్‌ వెళ్లేలా జాగ్రత్తపడ్డారు. ఇక సన్నివేశాన్ని రక్తి కట్టించవలసిన బాధ్యత బాబుగారిది. ఎల్లో మీడియా కుటుంబానికి చెందిన చానళ్లలో ‘మిలిటెంట్‌’ యాంకర్లంతా సిద్ధంగా ఉన్నారు. వారిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ ప్రదేశంలో ఒక పెద్ద మట్టిదిబ్బ ఉంది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి తెప్పించిన మట్టి. అది చాలు, సెంటిమెంట్‌ను ఇరగదీయడానికి. అందులో బాబుగారు కాకలుతీరిన రాజకీయ నటులు అనే జగత్‌ విఖ్యాతి ఉండనే ఉంది. ఇప్పుడేం జరుగుతుంది. మిలిటెంట్‌ యాంకర్లు ఊపిరిపీల్చడం కూడా మరిచిపోయారు.

బాబుగారు మట్టిదిబ్బపైకి ఎక్కి నిలబడ్డారు. పక్కన ఆజానుబాహుడైన అచ్చెన్న కూడా. బాబుగారు నెమ్మదిగా మోకాళ్లపై కూర్చుని, ఆ పిదప అమాంతంగా మట్టిదిబ్బపై బోర్లాపడ్డారు. ఆజానుబాహుడు మాత్రం కదలకుండా కాల భైరవుడిలాగా అలాగే నిల్చుండిపోయారు. ఇప్పుడు మట్టిదిబ్బ పైనుంచి నెమ్మదిగా లేచి కెమెరా ముందు రియాక్టు కావడమే పతాక సన్నివేశం. ఈ క్లైమాక్స్‌ పండాలి. అందుకోసం ఆయన ఏం చేస్తారో... పిడికెడు మట్టిని చేత్తో తీసుకుంటారు కావచ్చు. కెమెరా క్లోజప్‌లోకి వెళ్తుంది కావచ్చు. డైలాగ్‌ ఏమైవుంటుంది?.. ‘ఈ మట్టి మాది, ఈ నేల మాది, ఈ నీరు మాది, నీకెందుకు కట్టాలిరా శిస్తు’... కట్టబ్రహ్మన వేషంలో నడిగర్‌ తిలగం మాదిరిగా రెచ్చిపోతారా?. అంత నటవిజృంభణ కష్టమనుకుంటే కనీసం నటశేఖరుని పద్ధతిలో ‘ఈ మట్టిలో మట్టినై, గాలిలో గాలినై, నా జాతి జనులు పాడుకునే గేయాన్నయి..’ మిలిటెంట్‌ యాంకర్లలో రకరకాల ఊహలు ముసురుకుంటున్నాయి.

ఊహలు ఊయలలూగడమే తప్ప ఆయన మాత్రం కద లడం లేదు. ఎక్కడో రసభంగం జరిగింది. ఆయనకు స్క్రిప్టు గుర్తురావడం లేదు. హరిశ్చంద్ర నాటకం గుర్తుకొస్తున్నది. కాటి కాపరి సీను గుర్తుకొస్తున్నది. గుర్రం జాషువా గారి పాపులర్‌ పద్యం గుర్తుకొస్తున్నది. ‘‘ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే...’’ ఇక్కడ ‘ఇచ్చోటనే’ అన్నం తవరకు కామన్‌. మిగతాదంతా పేరడీ. తనకూ, తనవాళ్లకూ, వేలకోట్ల రూపాయలు సంపాదించిపెడుతుందనుకున్న కమ్మని రాజధాని కల ఈ మట్టిలో కలిసిపోయినట్టేనా? బహుశా, ఆయనలో దుఃఖం పొంగుకొచ్చి ఉండవచ్చు. అందుకే స్క్రిప్టు గుర్తు రాలేదు. ‘‘హైకోర్టు మీద బాగా ఆశపెట్టుకున్నాడు, చీఫ్‌ జస్టిస్‌ బదిలీతో బెంగటిల్లిపోతున్నాడు. ఆయన్ను లేపండయ్యా పాపం’’ అన్నారెవరో.

అక్కడి నుంచి పక్కనే ఉన్న యాగశాలకు. అక్కడ ఒక్క క్షణం మోకాళ్లపై కూర్చున్నారు. తన కమ్మని కలను మరోసారి మననం చేసుకున్నారు. తర్వాత సభ. వేదికపై ఎల్లో జెండాలతో పాటు మరో రెండుమూడు రంగు వెలసిన జెండాలు కూడా ఉన్నాయి. మూడు గ్రామాల రైతు ఉద్యమ వార్షికోత్సవ సభ అది. రాజధానికి భూములిచ్చిన వారిలో చాలామంది బినామీ రైతులే కనుక, ఆ సభకు పెద్దగా రైతులు పోటెత్తలేదు. భారతదేశ చరిత్రలో కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ, తెభాగా, పున్నప్రా – వాయిలార్, వర్లీ రైతాంగ ఉద్యమాలతో సమానమైనదిగా ఈ బినామీ రైతాంగ ఉద్యమాన్ని చూపెట్టాల నేది ఆయన తాపత్రయం. ఆ తాపత్రయానికి తగినట్టుగానే సభలో మాట్లాడారు. రాజధానిపై రెఫరెండం పెడదామని ఒక సవాల్‌ కూడా విసిరారు. కానీ, రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే తన పార్టీ ఓడిపోయిన సంగతిని, అదే ప్రాంతంలో తన ఏకైక కుమారుడు కూడా ఓటమిపాలైన సంగతిని మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టారు.

తన కలల రాజధానిలో చంద్రబాబు ఉద్యమ వార్షికోత్స వాలు జరుపుకున్న రోజునే విజయవాడలో మరో సభ జరిగింది. ఆ సభకు ముఖ్యఅతి«థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అది ‘మూగ’కు గొంతునిచ్చిన సభ. బలహీనుడికి ‘సాధికారత’ కరవాలాన్ని బహూకరించిన సభ. బీసీ వర్గంలో లెక్కకు వందకు పైగా కులాలుంటాయి. వాటిలో ఎక్కువ జనాభా కలిగిన ఆరేడు కులాలు మినహా మిగిలినవన్నీ తీవ్రమైన నిర్లక్ష్యానికీ, నిరాదరణకు గురైనవే. ఎమ్మెల్యే కాదు సరికదా జడ్‌పీటీసీ సభ్యునిగా కూడా ఎన్నిక కాలేని అశక్తతలో 90 కులాలున్నాయి. ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా వెనుకబడి వున్న బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలుచేయడం ప్రారంభించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ దేశ చరిత్రలో వైఎస్‌ జగన్‌ నిలబడిపోతారు.

కర్పూరీ ఠాకూర్‌ నుంచి కరుణా నిధి వరకు, కామరాజ్‌ నాడార్‌ నుంచి పినరయ్‌ విజయన్‌ వరకు ఇరవైమందికి పైగా బీసీ నేతలు ముఖ్యమంత్రులుగా పని చేశారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన కృషిని వీరందరికంటే మిన్నగా ఏడాదిన్నర కాలంలోనే వైఎస్‌ జగన్‌ చేసి చూపెట్టారు. జనాధిక్యత కలిగిన బీసీ కులాలకు కొన్ని రాజకీయ పదవులు ఇవ్వడం, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, ఉద్యోగాల్లో రిజ ర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు... ఇవే ఇప్పటివరకు రాజ కీయ నాయకత్వం నుంచి బీసీలకు అందిన ప్రోత్సాహకాలు. ఈ పరిమితుల్ని దాటి బీసీల అభ్యున్నతికి ఆత్మగౌరవ, ఆర్థికా భివృద్ధి రెక్కలను తొడిగిన తొలి పొలిటికల్‌ విజనరీ వైఎస్‌ జగన్‌. దేవాలయ కమిటీలతో సహా అన్ని నామినేషన్‌ గౌరవ పదవుల్లో సగం, నామినేషన్‌ పద్ధతుల్లో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో సగం బీసీలకేనని ప్రకటించి ఆయన తన సంకల్పాన్ని చాటిచెప్పారు. ఈ రెండు రెక్కలూ వుంటేనే భవిష్యత్తులో బీసీలు వారంతట వారు అభివృద్ధి చెందగలుగుతారు. లేనట్లయితే రాజకీయ నాయకత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిందే. ఈ అవగాహన నుంచే బీసీ అభివృద్ధి ప్రణాళికను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూపుదిద్దినట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఈ కులాల వికాసం కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్లకు నియమించిన 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించిన బీసీ సంక్రాంతి సభకు స్వయంగా ముఖ్యమంత్రి హాజరై వారిని అభినందించారు.

ఒకేరోజున జరిగిన ఈ రెండు సభలు ఏపీలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాల తాత్విక పునాదికీ, ఈ ఏడాదిన్నర కాలంలో ఆ రెండు పార్టీలు వ్యవహరించిన తీరుకు ప్రతీకలు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ సింగిల్‌ పాయింట్‌ కార్య క్రమంగా చేపట్టిన ఎజెండా అమరావతి. అవినీతి పునాదులపై కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నించిందనడానికి ఒక్కొక్కటిగా ఆధారాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ రహస్యాలను స్వార్థ ప్రయోజ నాలకోసం ఉపయోగించుకుని రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో వేలకోట్ల రూపాయల కుంభ కోణానికి తెలుగుదేశం పార్టీ పాల్పడిందని అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై విచారణ జరగవలసి ఉన్నది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కోటరీ తీవ్ర కలవరానికి, ఆందోళనకు గురయ్యారు.

ఏడాదికాలంగా ఆ పార్టీ వ్యవహారం, తీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలకు బలం చేకూర్చేదిగానే ఉన్నది. సంపూర్ణ రాజధానిగా అమరావతిని కొనసాగించడంకోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై అక్రమ పద్ధతుల ద్వారా చీకటి యుద్ధం చేయ డానికి, వెన్నుపోటు పొడవడానికి తెలుగుదేశం అధినేత సిద్ధమ య్యారు. ఇందుకోసం యావద్దేశం దిగ్భ్రమ చెందేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలను వాడుకునేందుకు సైతం పన్నాగాలు రచించారు. లిటిగెంట్‌ పద్ధతులతో న్యాయస్థానాలను ఆశ్రయించారు. న్యాయస్థానం వ్యవహరిస్తున్న తీరుపై ఒక దశలో ముఖ్యమంత్రి స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాయవలసి వచ్చింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బదిలీ, మరో జస్టిస్‌ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ప్రజలకు అనేక విషయాలను బోధపరిచాయి. మరో రాజ్యాంగ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ఉన్నతాధికారి చంద్రబాబు ప్రోద్బలంతో ప్రవర్తిస్తున్న తీరు విచిత్రంగా ఉన్నది. విశ్వామిత్రు నిచే నియుక్తుడైన నక్షత్రకుడిని ఆయన పదేపదే గుర్తుచేస్తు న్నాడు. ఇప్పుడిక చంద్రబాబు గారడీ విద్యలన్నీ ముగింపు దశకు చేరుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఆయన దగ్గర మిగిలిన ఏకైక బాణం విషప్రచారం. దానికి విరుగుడు సోషల్‌ మీడియా ఉండనే ఉన్నది.

అమరావతి మట్టినుంచి వేల కోట్లు దండుకోవాలన్న ఏకైక లక్ష్యం చంద్రబాబు ఐదేళ్ల పాలనకు దిక్సూచిగా నిలిచింది. అందుకు భిన్నంగా మానవీయతే మంత్రంగా వైఎస్‌ జగన్‌ పరిపాలన ప్రారంభమైంది. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు... ప్రతి పేదవాడూ బతుకు పోరులో చితికిపోకుండా నిలబడాలి. నిలబడడమే కాదు ముందడుగు వేయాలి. అందుకు ప్రభుత్వం ఆలంబన కావాలి. ప్రభుత్వ విధానాలలో ఈ అవగాహన ఒక అంతర్లీన సూత్రంగా ప్రవహిస్తున్నట్టు కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన ఆర్థిక మందగమనం, ఆ వెంటనే విరుచుకుపడిన కోవిడ్, లాక్‌డౌన్‌ల సమయంలో ముఖ్యమంత్రి నిబ్బరంగా తీసుకున్న నిర్ణయాలను ఆర్థికవేత్తలు పలువురు ప్రశంసించారు. సంక్లిష్ట సమయాల్లో పేద ప్రజల చేతుల్లో ఖర్చులకు డబ్బులుండేలా ప్రభుత్వం చర్యలు తీసు కున్నది.

బీద జనం చేతుల్లో తిరుగాడిన చిల్లర శ్రీమహాలక్ష్మి పెనుసంక్షోభాలను అవలీలగా దాటించింది. ఆర్థిక రథచక్రాన్ని ఆగిపోకుండా కాపాడింది. విద్య, వైద్య రంగాలపై ముఖ్యమంత్రి ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ప్రతి వ్యక్తికి అందుబాటులోకి తెచ్చే ఒక బృహత్తరమైన కార్య క్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రానున్న రెండు మూడే ళ్లలో ఈ యజ్ఞఫలాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలు అవు తాయి. పాలనా వికేంద్రీకరణ, వ్యవసాయ రంగాల్లో ప్రవేశ పెట్టిన విప్లవాత్మక మార్పులు అప్పుడే సత్ఫలితాలను ఇవ్వడం మొదలైంది. ఈ నెల 25న క్రిస్మస్‌ పర్వదినం, వైకుంఠ ఏకాదశి కలిసివచ్చే శుభదినాన 25 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను అందజేయబోతున్నారు. ఇదొక రికార్డు. ప్రతిపక్ష నాయకులు అడ్డంకులు సృష్టించకపోతే మరో ఐదులక్షల మంది కూడా ఇళ్ల పట్టాలు వారితోపాటే అందుకునేవారు. ఇక దిగి పోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ఎన్నో కుట్రలు చేసినా మానవీయ ఎజెండాకు ఏ ఢోకా ఉండబోదన్న నమ్మకం మొదలైంది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top