నేటికీ దారిచూపే ధ్రువతార | The unparalleled services rendered by Mahatma Jyotirao Phule continue to inspire millions of people today | Sakshi
Sakshi News home page

నేటికీ దారిచూపే ధ్రువతార

Apr 11 2026 2:28 AM | Updated on Apr 11 2026 2:28 AM

The unparalleled services rendered by Mahatma Jyotirao Phule continue to inspire millions of people today

ఏప్రిల్‌ 11 మనందరికీ ప్రత్యేకమైన రోజు. భారతదేశపు అగ్రశ్రేణి సంఘ సంస్కర్తల్లో ఒకరు, తరతరాలకూ మార్గదర్శిగా నిలిచిన క్రాంతి పథ గామి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి నేడు. ఆయన ద్విశతాబ్ది జయంత్యుత్సవాల ప్రారంభం నేప థ్యంలో, ఈ ఏడాది మరింత విశిష్ట తను సంతరించుకున్నది.నైతిక స్థైర్యం, నిరంతర సత్యా న్వేషణ, సామాజిక శ్రేయస్సు పట్ల అచంచలమైన అంకితభావం కల బోసిన ఉదాత్త జీవితం ఆయనది. ఎన్నో సంస్థలను నెలకొల్పి, ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించి చిరస్మరణీయులయ్యారు. ఆయన రేకెత్తించిన సరికొత్త ఆశలు, దేశజనుల్లో నింపిన ఆత్మవిశ్వాసం,మన నాగరికతా పరిణామ క్రమంలో ఆయన చేసిన అసమానమైన సేవలు నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తిని అందిస్తున్నాయి.  

సమానత్వ సాధనం తరగతి గది
పుణ్యభూమి మహారాష్ట్రలో 1827లో ఫూలే జన్మించారు. అతి సామాన్య నేపథ్యం నుంచి ఎదిగారు. తొలినాటి కష్టాలేవీ ఆయన అభ్యాసానికీ, సామాజిక నిబద్ధతకూ అడ్డుగోడలు కాలేకపోయాయి.  చిన్నతనంలోనే, విద్యార్థి దశ నుంచే అపారమైన జిజ్ఞాస ఉండేది. తన వయసు పిల్లల స్థాయికి మించిన పుస్తకాలను చదివేవారు. ‘మనం ఎంత ప్రశ్నిస్తే అంత జ్ఞానాన్ని పొందుతాం’ అని తర్వాతి కాలంలో ఆయనే చెప్పారు. చిన్ననాటి నుంచే అలవడిన ఆ సత్యాన్వే షణ దృక్పథం ఎక్కడా రాజీపడకుండా జీవితాంతం కొనసాగింది. 

విద్యనూ, జ్ఞాన సముపార్జననూ జీవిత లక్ష్యాలుగా మలచు కున్నారు మహాత్మా ఫూలే. జ్ఞానం కొందరి గుత్తాధిపత్యం కాదనీ, ఆ శక్తి అందరికీ అందాలనీ స్పష్టంగా గుర్తించారు. అనేకులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షగా ఉన్న ఆ కాలంలోనే బాలికల కోసం, విద్యా వకాశాలు లేని వర్గాల కోసం పాఠశాలలను తెరిచి విద్యా విప్లవానికి నాంది పలికారు. ‘తల్లి ద్వారా బిడ్డకు అందే సంస్కారం అమూల్య  మైనది. 

అందుకే, పాఠశాలలు తెరవాలనుకుంటే మొదట బాలికల కోసమే తెరవాలి’ అనేవారాయన. సామాజిక న్యాయాన్నీ, సమాన త్వాన్నీ సాధించే శక్తిమంతమైన సాధనంగా తరగతి గదిని నిలిపి, ఓ సరికొత్త సామాజిక దృక్పథాన్ని ఆవిష్కరించేందుకు కృషి చేశారు.విద్య పట్ల ఆయన దార్శనికత స్ఫూర్తిదాయకం. దేశ యువతలో పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా గత పదేళ్లుగా మేమెంతో కృషి చేశాం. విజ్ఞానం, నైపుణ్యాలు, అవకా శాల్లో పెట్టుబడుల ద్వారా... సమస్యల పరిష్కర్తలుగా, దేశ ప్రగతికి సారథులుగా భారత్‌ తన యువతను  తీర్చిదిద్దుతోంది. 

సమాన హక్కులతోనే నిజమైన స్వేచ్ఛ
మహాత్మా ఫూలే తన విజ్ఞానంతో, వివేకంతో... వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలపై విస్తృత అవగాహనను పెంపొందించుకున్నారు. రైతులు, కార్మికులకు అన్యాయం జరిగితే మన సమాజం బలహీనపడుతుందని చెప్పేవారు. పేదలు, అణగా రిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో నిమగ్నమయ్యారు. 
‘జోపర్యంత సమాజాతీల సర్వానా సమాన అధికార మిళత్‌ నాహీత్, తోపర్యంత ఖరే స్వతంత్య్ర మిళత్‌ నాహీ (సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించేంత వరకు నిజమైన స్వేచ్ఛను సాధించలేము)’ అన్నది ఫూలే అభిప్రాయం. 

సమ సమాజం లక్ష్యంగా, ఈ ఆశయాన్ని కార్యాచరణగా మలిచే దిశగా ఎన్నో సంస్థలను ఆయన నెలకొల్పారు. ఆయన స్థాపించిన ‘సత్య శోధక’ సమాజం ఆధునిక భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో ఒకటి. సామాజిక సంస్కరణ, సమాజ సేవ, మానవ గౌరవాన్ని పెంపొందించడంలో ఇది అగ్రగా మిగా నిలిచింది. మహిళలు, యువత, గ్రామీణులకు గొంతుకైంది. 

ఆయన వ్యక్తిగత జీవితమూ ధైర్యసాహసాలను బోధించే పాఠమే! నిరంతరం జనబాహుళ్యంలో ఉంటూ ప్రజల కోసం పరిత పించడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపింది. పక్షవాతం బారిన పడి శరీరం సహకరించని స్థితిలోనూ తన కృషిని కొనసాగించారు. ఆయన శరీరం కఠిన పరీక్షను ఎదుర్కొని ఉండవచ్చు, కానీ సమాజం పట్ల ఆయన నిబద్ధత మాత్రం సడలలేదు.

సావిత్రీబాయి ఫూలేను స్మరించుకోకుండా జ్యోతిరావు ఫూలే స్మృతి అసంపూర్ణమే అవుతుంది. దేశపు తొలితరం మహిళా ఉపాధ్యా యినిగా, బాలికా విద్యావికాసంలో ఆమె నిర్ణయాత్మక పాత్ర పోషించారు. మహాత్మా ఫూలే మరణానంతరమూ ఆ ఆశయ దీప్తిని సావిత్రీబాయి ఆరనివ్వలేదు. 1897లో ప్లేగు వ్యాధి విరుచుకుపడిన తరుణంలో బాధితుల సేవలో ఆమె పునరంకిత మయ్యారు. చివ రకు అదే వ్యాధికి గురై ప్రాణాలు విడిచిన త్యాగమూర్తి ఆమె. 

నవ భారత దీప్తి
మనది పుణ్యభూమి. విశిష్టమైన భావాలు, నిరుపమాన త్యాగాలతో మన సమాజాన్ని శక్తిమంతంగా మలచిన మహనీ యులకు నిలయమిది. మార్పు ఎక్కడో మొదలవుతుందని ఎదురు చూడలేదు. వారే మార్పునకు నాంది పలికారు. శతాబ్దాల నుంచి దేశంలో సామాజిక పురోగతి దిశగా మన సమాజం నుంచే శంఖా రావం వినిపించింది. పీడితుల వ్యధను గుర్తించి, దానిని ‘తలరాత’ అని సరిపెట్టుకోకుండా ఎదురుతిరిగిన వారినుంచి ఆ చైతన్యం పుట్టుకొచ్చింది. అలాంటి యోధుల్లో ఒకరు మహాత్మా ఫూలే.

2022లో పుణె పర్యటన సందర్భంగా, అక్కడి ఫూలే భవ్య విగ్రహం వద్ద నివాళి అర్పించడం నాకెప్పటికీ గుర్తుంటుంది. ఆయన ద్విశతాబ్ది జయంత్యుత్సవాల ప్రారంభ వేళ, ఆయన ఆశయాలకు పునరంకితం కావడమే మనం అర్పించే నివాళి. ముఖ్యంగా ఆయన కెంతో ఇష్టమైన విద్య వంటి ఆదర్శాలకు పునరంకితం కావాలి. అన్యాయంపై నిరసన తెలిపే సున్నితత్వాన్ని పెంచుకోవాలి. సమాజ స్వయం సంస్కరణ సామర్థ్యంపై మన విశ్వాసాన్ని బలంగా చాటాలి. 

నైతిక స్పష్టత, ప్రజా ప్రయోజనం రెండూ తోడైతే... ఈ సమాజశక్తి దేశంలో అద్భుతాలు సృష్టించగలదని ఆయన జీవితం నిరూపించింది. అందుకే నేటికీ లక్షలాది మందికి ఆయన ఆలోచ నలు బలాన్నిస్తున్నాయి. ఆయన మాటలూ, చర్యలూ ఆశను చిగురింపజేస్తున్నాయి. జన్మించి రెండు వందల ఏళ్లు గడుస్తున్నా – మహాత్మా జ్యోతిరావు ఫూలే గత కాలపు శక్తిగానే కాకుండా, నవ భారత భవితకు మార్గదర్శిగా విరాజిల్లుతున్నారు.

-నరేంద్ర మోదీ
-భారత ప్రధాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement