కొత్త నిర్ణయాలు తీసుకుందాం! | Sakshi
Sakshi News home page

కొత్త నిర్ణయాలు తీసుకుందాం!

Published Mon, Jan 8 2024 5:26 AM

Sakshi Guest Column On Some conclusions

కొత్త సంవత్సరంలో వ్యక్తులుగా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అదే విధంగా మనమంతా ఒక దేశంగా కూడా కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. పార్లమెంటులో సభా సమయాన్ని దుర్వినియోగం చేయబోమని ఎంపీలూ, చర్చల పేరుతో జనాల మధ్య గొడవలు సృష్టించబోమని టీవీ యాంకర్లూ తీర్మానించుకోవాలి. ట్రాఫిక్‌ నియమాలను అతిక్రమించకుండా వాహనాలను ధ్యాసగా, జాగ్రత్తగా నడుపుతామని మనం సంకల్పం చెప్పుకోవాలి. కానీ మూణ్ణాళ్లకే ఈ తీర్మానాలన్నీ వట్టి ముచ్చటగా మారిపోతే? అసలీ తీర్మానాలు తీర్చేవా, మార్చేవా? దీనికి ఒకటే జవాబు. తీర్చడం, మార్చడం కళ్లకు కనిపించపోవచ్చు. కానీ, అసలంటూ కొత్త నిర్ణయం తీసుకోవటం అన్నదే సంకల్ప సాధనలోని నిబద్ధతకు మొదటి మెట్టు అని గుర్తించాలి.

పూతకొచ్చే తీర్మానాలకు కొత్త సంవత్సరం ప్రియమైన రుతువు అయినప్పటికీ, వాటిల్లో చాలా వరకు ఎక్కువ కాలం జీవించి ఉండవు. గొప్ప ఉత్సాహపు ధ్వనితో మొగ్గ తొడిగి, చప్పుడే కాని పరిహాసపు గాలివానలతో టప్పున నేల రాలేందుకే అవి చిగురిస్తాయి. అయినప్పటికీ, మనమంతా ఒక దేశంగా కొన్ని తీర్మానాలను స్వీకరించాలని నేనిప్పుడు సూచించబోవడం మీకొక ప్రశ్నార్థకం అవొచ్చు. దీనికి చాలా సులభమైన జవాబే ఉంది. చేయాలని అనుకున్న దానిలో నిబద్ధత కొరవడినా, ఏం చేయవలసిన అవసరం ఉన్నదో దానిని ఒక సంకల్పంలా తీసుకోవడమే అసలొక తీర్మానం. కనుక ఈ కొత్త సంవత్సర ఆరంభంలో ఆ మొదటి అడుగు వేద్దాం. ‘సంకల్పం’ అనే అడుగు. 

మొదటిది, ఒకటేంటంటే మన రాజకీయ నాయకులు చేయ వలసినది. పార్లమెంటులో ఎంతో విలువైన ప్రజాసమయ దుర్విని యోగానికి పాల్పడే విధంగా తమ ప్రవర్తన ఉండకూడదని వారు తీర్మానం చేసుకోవాలి. వాళ్లు అక్కడ కూర్చున్నందుకు మీకు, నాకు అవుతున్న ఖర్చు నిమిషానికి 2 లక్షల 50 వేల రూపాయలు. ఈ ఖర్చును మనం సంతోషంగానే భరిస్తున్నాం.

ఎందుకంటే, నిజాలను నిగ్గు తేల్చేందుకు, ప్రభుత్వ పనితీరును ఎత్తిచూపేందుకు, నిశిత పరిశీలనకు; అవినీతిని, అసమర్థతను బహిర్గతం చేయడానికి... ప్రశ్నలు, చర్చలు తప్పనిసరి అని మనం విశ్వసిస్తాం. అటువంటిది... సభ ‘వెల్‌’లోకి దూసుకెళ్లే, స్పీకర్‌పై రంకెలు వేసే, సభకు గైర్హాజరు అయ్యే ఎంపీలకు మన కష్టార్జితాన్ని ఎందుకు ఖర్చుపెట్టాలి? 16వ లోక్‌సభ (2014–19) సభా సమయం 1,615 గంటలు కాగా,అందులో 16 శాతం సమయాన్ని అంతరాయాలు, వాయిదాల కారణంగా కోల్పోయాం. ఆ కోల్పోయిన సమయానికి అయిన ఖర్చు రూ. 39 కోట్లు. 

మన ప్రజాప్రతినిధులుగా, మనం వారికి నిధులు సమ కూరుస్తున్నాం కనుక, ఆ విలువకు సమానమైన సేవలను మన ఎంపీలు మనకు అందించాలి. అందుకు మనం అడుగుతున్నదల్లా పార్లమెంటు సమర్థంగా, అర్థవంతంగా పనిచేయాలని! వారి నుండి ఈ కొత్త సంవత్సరం మనకు ఇలాంటి హామీ లభిస్తుందా?  

తర్వాత, ప్రెస్‌! ఇక్కడ నా ఉద్దేశం ప్రెస్‌ అంటే ప్రధానంగా టెలివి జన్‌ న్యూస్‌ చానెళ్లు. టీవీ వీక్షకులు డబ్బు చెల్లిస్తారు కనుక ముఖ్యమైన వార్తల్ని ఆశించే హక్కు వారికి ఉంటుంది. ఏది ముఖ్యమైన వార్తో నిర్ణయించడానికి అనేకమైన ప్రామాణికాలు ఉంటాయన్న దాంట్లో సందేహమేమీ లేదు కానీ, చివరికొచ్చేటప్పటికి ప్రధానంగా ప్రాముఖ్యం, ఔచిత్యం, సమతౌల్యం అనేవి లెక్కలోకి వస్తాయి. 

కనుక టీవీ వాళ్లకు నేను చెప్పేదేమిటంటే, దయచేసి మీరు సినిమా తారలు, క్రికెటర్ల పట్ల మీకున్న మక్కువను వదులుకోండి. ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ కోసం మీ పరుగులను ముగించండి; బదులుగా కచ్చితత్వం పైన, విశ్లేషణ మీద దృష్టి పెట్టండి; మరీ ముఖ్యంగా... సాగతీతల్ని ఆపేయండి. ఏ వార్తా కథనానికైనా తన సహజమైన నిడివి ఉంటుంది. కేవలం ప్రసార సమయాన్ని భర్తీ చేయడానికి ఆ నిడివిని పొడిగించుకుంటూ పోకండి. గుర్తుంచుకోండి.

మేము పెద్దవాళ్లం; మమ్మల్ని పిల్లల్లా చూడకండి; మేము తరచు పిల్లల్లా స్పందిస్తున్నా కూడా అలాగే, మన యాంకర్లకు ఎవరైనా చర్చల లక్ష్యం జనం మధ్య గొడవలు సృష్టించడం కాదని చెప్పగలరా... ఆ జనం ఒకవేళ గొడవలకు సిద్ధంగా ఉన్నప్పటికీ! చర్చ అనేది ప్రజాభిప్రాయాన్ని రాబట్టేందుకు... అది కూడా ఒక వివేచనతో, వీలైతే తక్కినవారికి భిన్నంగా, పూర్తిగా తమదైన ప్రత్యేకతతో ఉండాలనీ... చర్చకు వచ్చిన అతిథులు తమతో ఏకీభవించేలా యాంకర్లు వారిపై మాటల బల ప్రయోగం చేయకూడదనీ వీక్షకులుగా ఈ కొత్త సంవత్సరంలో మనం ఆశపడదాం. 

చివరిగా, మనమంతా ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉన్న విషయం – సురక్షితంగా వాహనం నడపడం. పద్ధతిగా, తెలివిడిగా నడపాలి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీని దాటేందుకు వేరే వైపు మళ్లకండి. ఎర్ర రంగు పడటానికి ముందు ఆరెంజి రంగులోకి సిగ్నల్‌ మారినప్పుడు మీ అదృష్టంపై నమ్మకంతో జంక్షన్‌లో మీ వాహనాన్ని ముందుకు దూకించకండి.

ఇంకొక సంగతి, మీరు మీ కారును పార్క్‌ చేస్తున్నప్పుడు వేరొకరి గేటుకు కానీ, తోవకు కానీ అడ్డంగా నిలుపుతున్నారేమో గమనించండి. ఇక మన డ్రైవింగ్‌ ఎలా ఉండాలనే దానికి ఎల్ల వేళలా వర్తించే సాధారణ నియమం – రోడ్డుపై మీరే కాకుండా ఇంకా చాలామంది వాహనం నడు పుతూ ఉంటారు కనక – రోడ్డుపై మీకున్నంత హక్కే వారికీ ఉంటుందని గ్రహించడం! 

మరీ పాత సంగతి కాదు కానీ, సిగరెట్‌ తాగడం మొదలుపెట్టాలని నాకొక కొత్త సంవత్సర తీర్మానం ఉండేది. గడియారం సరిగ్గా రాత్రి పన్నెండు కొట్టగానే నా వేళ్ల మధ్య సిగరెట్‌ వెలుగు తుండేది. మర్నాడు సాయంత్రమంతా ఉమ్మడం, దగ్గడం! ‘సిగరెట్‌ తాగకపోవడం’ అనే వ్యసనాన్ని దూరం చేసుకోడానికి నేను ఎంచుకున్న మార్గం అది. అయితే జనవరి చివరినాటికి నా తీర్మానం పట్టు సడలిపోయేది. అది వ్యసనంగా మారుతుందేమోనన్న భయం నా చేత సంతోషంగా సిగరెట్‌ మాన్పించేది. అలా నేను దానికి దూరంగా ఉండటం జరిగేది. 

ఈ సంవత్సరం నేను మరింత పెద్ద సవాలును స్వీకరిస్తున్నాను. టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చే నా అతిథులకు అంతరాయం కలిగించడాన్ని మానుకోవాలని నిర్ణయించుకున్నాను. బదులుగా, వారిని తమ ఊకదంపుడుకు, అదే పనిగా మాట్లాడేందుకు అనుమ తిస్తాను. వాళ్లేం మాట్లాడినా, మాట్లాడవలసిన దానిని వాళ్లసలే మాట్లాడకపోతున్నా – మీరు, మిగతా వీక్షకులు అరచి నిరసన తెలియజేసే వరకు వాళ్లకు అడ్డుతగలనే తగలను. ‘వద్దు కరణ్, మీరు మీ పాత భౌభౌమనే రాట్‌వైలర్‌ జాతి శునకం స్టెయిల్‌కి వచ్చేయండి’ అంటూ తొలి విజ్ఞాపన పత్రం నాకు అందినప్పుడు మాత్రమే నేను ఎప్పటిలా నా పాత శైలికి వచ్చేస్తాను. 

మరి అలాంటి విజ్ఞాపన పత్రం ఒకటి ఎప్పటికీ రాకపోతే? మా ప్రియమైన పోస్ట్‌మ్యాన్‌ నేను ఎదురు చూసే క్రిస్మస్, న్యూ ఇయర్‌ కార్డులన్నిటినీ ఎక్కడో తారుమారు చేసి ఉండొచ్చని అనుకోవాలి. ఏ సంగతీ ఏదో ఒక విధంగా త్వరలోనే మీకు తెలుస్తుంది. 
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
Advertisement