అమృతోత్సవ దీక్షకు ఫలితం?!

Sakshi Guest Column On Koregaon Dalit Mahasabha By ABK Prasad

కోరేగావ్‌ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్ష›సభ్యులు పాలకుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురిచేశారు. గూఢచర్య ‘పెగసస్‌’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడింది. ఆఖరికి చిన్న దేశమైన భూటాన్‌ కరెన్సీతో ఇండియా రూపాయి సమానమైంది. ఇలా గడిచిన ఏడాది ఎన్నో పరిణామాల్ని భారతీయ సమాజం చవిచూసింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ పాలకులు, పాలితులు మిగిలిన పాఠాలను స్మరించు కోవలసి ఉంది. గడిచిన 75 ఏళ్ల చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది.

భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ దేశ న్యాయ స్థానాలకూ, పాలక వర్గానికీ, పౌర సమాజానికీ బాధ్యతా యుతమైన కర్తవ్యాన్ని (30 డిసెంబర్‌ 2022) నిర్దేశించారు. రాబోయే రోజుల్లో దేశ న్యాయ వ్యవస్థలో మహిళలదే ప్రధాన పాత్ర కాబోతున్నదనీ, వలసవాద ఆలోచనా విధానాల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించవలసిన సమయం వచ్చిందనీ అన్నారు. వ్యక్తులను అకారణంగా అరెస్టులు చేసి, జైళ్లలో పెట్టడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ పలువురు పౌరుల విడుదలకు మార్గాన్ని సుగమం చేశారు. 

కోరేగావ్‌ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్షాల సభ్యులు పాలకుల్ని హత్య చేయ డానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. కోరేగావ్‌ దళితుల సభలో స్వయంగా పాల్గొన్న న్యాయమూర్తులు ఈ అరెస్టులను, వేధింపులను నిరసించినా పాల కుల కుట్రపూరిత వైఖరి కొనసాగుతూనే వచ్చింది.

కాగా జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా పదవిని స్వీకరించిన తర్వాత ఈ వేధింపుల విషయంలో కూడా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. అరెస్టయినవాళ్లు జైళ్లలో నిరవధికంగా విచారణ లేకుండా మగ్గడాన్ని గమనించి, నిష్కారణ పరిణామానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి నిర్ణయిం చారు. విచారణను త్వరితం చేసి, డిటెన్యూల విడుదలకు క్రమంగా చర్యలు తీసుకోవడం హర్షించదగిన పరిణామం. 

ఫాదర్‌ స్టాన్‌ స్వామి అరెస్టు ఉదంతం పాలక వర్గాల అత్యంత నీచమైన చర్య. భారత నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సేకరించానని ప్రకటించిన ‘సాక్ష్యం’ ఫాదర్‌ స్టాన్‌ స్వామి, తదితర నిందితుల కంప్యూటర్లలోకి పనిగట్టుకొని చొప్పించిన దొంగ సాక్ష్యాలే నని ప్రసిద్ధ అమెరికన్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ కంపెనీ ‘ఆర్సెనల్‌ కన్సల్టెన్సీ’ విడుదల చేసిన నివేదికలో (10 డిసెంబర్‌ 2021) పేర్కొంది. విచిత్రమేమంటే, ఏ ఇజ్రాయిల్‌ స్పైవేర్‌ ‘పెగసస్‌’ను భారత పాల కులు ఉపయోగించారో, దాని సంస్థతో ఎన్‌ఐఏ కూడా సంబంధాలు పెట్టుకుంది.

అయితే సుప్రీంకోర్టు (27 అక్టోబర్‌ 2021) విచారణ కోసం ఒక సాంకేతిక సంఘాన్ని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ అధ్యక్షులుగా ఉన్న ఈ కమి టీలో ప్రొఫెసర్‌ పి. ప్రభాకరన్, ప్రొఫెసర్‌ అశ్వన్‌ గుమస్తే సభ్యులుగా ఉన్నారు. నిందితుల ఫోన్లను ఇజ్రాయిల్‌ పెగసస్‌ స్పైవేర్‌ ట్యాంపర్‌ చేస్తున్న విషయం నిజమా? కాదా? అని తేల్చాలని ఈ కమిటీ ఎన్‌ఐఏను ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఆ విషయాన్ని ఎన్‌ఐఏ తేల్చకుండా దాటవేసిందని వార్తలు.

ఈ ‘కప్పదాట్లు’ అంతటితో ఆగ లేదు. ‘పెగసస్‌’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడేంతవరకు కొనసాగుతూనే వచ్చింది. అంతేగాదు, కాంగ్రెస్‌ పాలకుల ‘బోఫోర్స్‌’ కొనుగోళ్ల వల్ల దేశం నష్టపోయింది రూ. 70 కోట్లు కాగా, బీజేపీ–ఆరెస్సెస్‌ పాలకుల రఫేల్‌ (ఫ్రెంచి) విమానాల కొనుగోళ్ల వల్ల దేశం కోల్పోయింది రూ. 70 వేల కోట్లని తేలినా నిగ్గతీయగల చైతన్యాన్ని ప్రతిపక్షాలూ కోల్పోయాయి. 

ఆ మాటకొస్తే, 2002లో గుజరాత్‌లో ఏమైంది? పాలకుల అధికారిక దౌర్జన్యాలను, ఆగడాలను ఎండగట్టి, వారు శిక్షార్హులేనని సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారుగా విచారణకు నియమితులైన ‘ఎమి కస్‌ క్యూరీ’ ప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్‌ సమర్పించిన నివేదికను కూడా పాలకులు తొక్కిపట్టిన ఉదంతాన్ని దేశం మరచి పోలేదు. ఇన్ని రకాల దారుణాలకు, పాలక పక్షాలు ఒడిగట్టిన దేశంలో – స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవాలు ముగిసిన వేళలో పాల కులకు, పాలితులకు మిగిలిన గుణపాఠాన్ని స్మరించుకోవలసిన సమయమిది. దేశ స్వాతంత్య్రం కోసం సకల వ్యక్తిగత సౌకర్యాలను గడ్డిపోచగా భావించి ప్రాణాలు సహా సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షలాదిమంది దేశభక్తులను ఒక్కసారి తలచుకోవలసిన సమయం ఇదే. గడిచిన 75 ఏళ్ల పరిణామాల నుంచి గుణపాఠాలు తీసు కోవలసిన ఘడియ కూడా ఇదే! 

అంతేగాదు, ఈ 75 ఏళ్లలోనే క్రమంగా పత్రికా రంగంలో కూడా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ స్పృహకన్నా కార్పొరేట్‌ ఇండియాలో భాగంగా కార్పొరేట్‌ మీడియా బలిసింది. పత్రికా రంగంలో ప్రయివేట్‌ రంగ ప్రయోజనాల ప్రాధాన్యం పెరిగింది. తద్వారా జర్నలిజం స్వరూప స్వభావాలనే అది తారుమారు చేస్తూ వచ్చింది. 1955 నాటికే వర్కింగ్‌ జర్నలిస్టుల, తదితర వార్తా పత్రికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రత్యేక చట్టమే వచ్చింది.

ఫలితంగా ఇతర సంస్థలలో పనిచేసే వివిధ వృత్తిదారుల ప్రయోజ నాలను కూడా రక్షించే నిబంధనలు అందులో పొందు పర్చడం జరిగింది. ఇది లేబర్‌ కోర్టుల ద్వారా ఉద్యోగుల సమస్యల సామరస్య పరిష్కారానికి తోడ్పడింది. తొల్లింటి ప్రయివేట్‌ మీడియాను జైన్లు, బిర్లాలు, గోయెంకా లాంటి జూట్‌ వ్యాపారులు నిర్వహించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని నడమంత్రపు ‘సిరి’ పారిశ్రామికవేత్తలు భర్తీ చేశారు. వీళ్లపైన భారత రాజ్యాంగ నిబంధనల ఆజమాయిషీ బొత్తిగా మృగ్యమై పోవడం కూడా కాంగ్రెస్, బీజేపీ–ఆరెస్సెస్‌ పాలనల ‘పుణ్యమే’. కాబట్టి ఈ సమీక్ష అనివార్యమవుతోంది. 

చివరికి మన కరెన్సీ కూడా ఈ 75 ఏళ్లలో ఏ స్థాయికి దిగజారి పోయిందో, ఆ దిగజారుడులో కాంగ్రెస్‌ పాలకులు కూడా భాగ స్వాములయినా ఒక ఆలోచనాపరురాలిగా, కాంగ్రెస్‌ వాదిగా భావికా కపూర్‌ నిర్మొహమాటంగా ఇలా వర్ణించారు: మన ప్రగతి ‘వేగం’ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే – ‘‘భూటాన్‌ కరెన్సీ ఇప్పుడు ఇండియా కరెన్సీతో సమానం. ఒక భూటానీస్‌ గుల్‌ట్రమ్‌ (కరెన్సీ) ఒక రూపాయితో సమానమైంది. భూటాన్‌ ఒక్కటే కాదు, అఫ్గానిస్తాన్‌ రూపాయి కూడా ఇండియా రూపాయితో సమానమై కూర్చుంది. అంటే, మనమిప్పుడు తాలిబన్ల రాజ్యానికి సమానమన్నమాట. వావ్‌ మోదీజీ.. వావ్‌!’’ (30 డిసెంబర్‌ 2022) ఏది ఏమైనా, 75 ఏళ్ల భారత అమృతోత్సవాలు ముగిసిన వేళలో ఒక మహాకవి, స్వతంత్ర భారత మానవుడిని తలచుకుని అతని నేటి దుఃస్థితికి స్పందించిన తీరును మరొక్కసారి గుర్తు చేసుకుందాం:

‘‘ఆ మానవమూర్తి ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వులేదు! స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యుడా మానవుడు అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో మండుతూన్న కళ్లతో ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతాడా ప్రాణి? అందుకే అతణ్ణి జాగ్రత్తగా చూడండి స్వతంత్ర భారత పౌరుడు అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి అతని యోగ క్షేమాలకు / అందరూ పూచీపడండి అతికించండి మళ్లీ / అతని ముఖానికి నవ్వు! స్వాతంత్య్రం ఒక చాలా సున్నితమైన పువ్వు,చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం స్వాతంత్య్రం తెచ్చేవెన్నెన్నో బాధ్యతలు సామర్థ్యంతో నిర్వహిస్తామని / సంకల్పం చెప్పుకుందాం’’

ఇంతకీ మహాకవి ఆశించిన ఆ ‘సామర్థ్యం, సంకల్పం’ మనలో ఏది? అది మనలో కరువయింది కాబట్టే పాలకుల పాలనా సామ ర్థ్యాన్ని గత సుమారు రెండు దశాబ్దాలుగా బొడ్లో చేయివేసి ప్రశ్నిస్తున్న ‘ఏడీఆర్‌’(అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌) నిరంతర నివే దికలు కూడా ‘బుట్టదాఖలు’ అవుతున్నాయి.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top