యుద్ధ కొరతలకు కిం కర్తవ్యం? | Sakshi Guest Column On Iran War Effect On India | Sakshi
Sakshi News home page

యుద్ధ కొరతలకు కిం కర్తవ్యం?

Apr 10 2026 12:18 AM | Updated on Apr 10 2026 12:18 AM

Sakshi Guest Column On Iran War Effect On India

విశ్లేషణ

ఇరాన్‌ యుద్ధం భారత్‌ శక్తి, ఆహార భద్రతలలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. ఆర్థిక కోణంలోనే కాకుండా సైనిక భద్రతా కోణంలో కూడా ఇరాన్‌ యుద్ధం భారత్‌కు గుణపాఠాలు నేర్పుతున్నది. సాధారణంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాలపై యుద్ధ ప్రభావం ఉంటుంది. కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో అది ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తున్నది. మన దేశ ముడి చమురు దిగుమతులలో సుమారు 40 శాతం, ఎల్‌ఎన్‌జీ దిగుమతులలో 50 శాతం, ఎల్‌పీజీ దిగుమతులలో సుమారుగా 80–90 శాతం హార్మూజ్‌ జల సంధి నుండే రావాలి. ముడిచమురును మనం రష్యా, యూఎస్‌ఏ, బ్రెజిల్, మెక్సికో మొదలగు దేశాల నుండి అదనంగా కొనటం ద్వారా పూరించుకోగలుగుతున్నాము. 

సుమారుగా 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాము. కానీ ఎల్‌పీజీ (వంటగ్యాస్‌) దిగుమతులు ప్రధానంగా ఖతర్‌ నుండి హార్మూజ్‌ జలసంధి ద్వారానే రావాలి. యుద్ధం ప్రారంభం కావడా నికి ముందు బ్యారెల్‌కి 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్లకు చేరుకొంది. కాల్పుల విరమణ వార్తలు చమురు ధరలకు కాస్త ఉపశమనం కలుగజేస్తున్నాయి. బ్యారెల్‌కు ప్రతి 10 డాలర్ల పెరుగుదల వలన సుమారుగా 15–16 బిలియన్‌ డాలర్లు చమురు దిగుమతికి అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. సౌదీ, యూఏఈ, ఖతర్‌ దేశాల చమురు క్షేత్రాలు, చమురుశుద్ధి కేంద్రాలకు నష్టం వాటిల్లటంతో, యుద్ధం ముగిసిన తరువాత కూడా చమురు ధరలు తగ్గకపోవచ్చు. చమురు, తత్సంబంధ ఉత్పత్తుల లభ్యతలో సమస్యలు ఉండవచ్చు.

ఎరువుల ఉత్పత్తికి దెబ్బ
ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో చర్చ ఎక్కువగా ముడిచమురు, ఎల్‌పీజీ మీదనే కేంద్రీకృతమయింది. ఇంతకంటే పెనుముప్పు దాగున్నది. ఎరువుల తయారీకి కావలసిన సహజ వాయువు, ఎల్‌ఎన్‌జీ, అమోనియా, ఫాస్పారిక్‌ ఆమ్లం, గంధకం, పొటాష్‌ వంటి ముడిసరుకుల కొరకు మనం గల్ఫ్‌ దేశాల మీద ఆధారపడు తున్నాము. బొగ్గు ఆధారిత ఎరువుల ఉత్పత్తిని గత రెండు దశా బ్దాలుగా సహజవాయువు/ఎల్‌ఎన్‌జీ ఆధారంగా మార్చివేశాం. ఎల్‌ఎన్‌జీ విషయంలో సుమారుగా 50 శాతం దిగుమతులపై ఆధార పడుతున్నాము. ఖతర్‌ నుండి ఎల్‌ఎన్‌జీ; యూఏఈ, ఒమన్‌ల నుండి ఎల్‌ఎన్‌జీ/సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నాము. యూరియా, డీఏపీ, ఎన్‌పీకే ఎరువుల తయారీకి వాడే అమో నియాను సౌదీ, ఖతర్, ఒమన్, యూఏఈ నుండి దిగుమతి చేసు కుంటున్నాము. 

సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ (ఎస్‌ఎస్‌పీ) తయారీకి వాడే గంధకం ప్రధానంగా సౌదీ, యూఏఈ, ఖతర్, కువైట్‌ల నుండి దిగుమతి అవుతున్నది. ఎమ్‌ఓపీ (మ్యురేట్‌ ఆఫ్‌ పొటాష్‌)లో వాడే పొటాష్‌ దిగుమతిలో 42 శాతం సౌదీ నుండి వస్తున్నది. ఒమన్‌ నుండి సుమారుగా 26 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. యుద్ధం వలన ఎరువుల ముడిసర కుల దిగుమతికి ఇబ్బంది ఏర్పడటమే కాకుండా ధరలు కూడా పెద్ద మొత్తంలో పెరిగాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా ఎరువుల కొరత ఏర్పడ వచ్చును. రానున్న ఎల్‌నినో వాతావరణ నేపథ్యంలో, ఎరువుల సమస్య అగ్నికి ఆజ్యంలా తోడయితే మన ఆహార భద్రత ప్రమాదంలో పడవచ్చు.

ఆర్థిక మాంద్యం తప్పదా?
పరోక్షంగాయుద్ధ ప్రభావం, ఫార్మాస్యూటికల్, ప్యాకేజింగ్, నిర్మాణ సామగ్రి, అల్యూమినియం, సెమికండక్టర్‌ తయారీ రంగా లపై కూడా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీమా ఖర్చులు పెరగటంతో అంతర్జాతీయ షిప్పింగ్‌ వ్యయం పెరిగి అన్ని వస్తువుల దిగుమతులు మరింత ప్రియమవుతాయి. కోవిడ్‌ దెబ్బ నుండి కోలు కొని అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చూపింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. గత దశాబ్దంలో భారతదేశం ద్రవ్యోల్బణాన్ని మంచి నియంత్రణలో ఉంచగలిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్పణం 4 శాతం కిందకు పడిపోయింది. అయితే, దిగుమతుల వ్యయం, ధరల పెరుగుదల వలన బడ్జెట్‌ లోటు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి క్రమంగా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశాలున్నాయి. గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా సంవత్సర కాలంగా రూపాయి విలువ వేగంగా పతనమవుతున్నది. పెట్టుబడులు భారత దేశం నుండి తరలిపోతున్నాయి. యుద్ధ అనిశ్చితి నేపథ్యంలో మొదటగా బంగారం, తరువాత డాలర్‌ (అమెరికన్‌ మార్కెట్‌) వైపు పెట్టుబ డులు తరలిపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించటంతో దిగుమ తులు ఖరీదవుతున్నాయి. 

పెరిగిన చమురు ధరల ప్రభావం నుండి సామాన్య పౌరుడిని కాపాడటానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. చమురు కంపెనీలపై భారాన్ని తగ్గించ టానికి చమురు ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించింది. వాణిజ్య వంట గ్యాస్, విమాన ఇంధనాల ధరలను మాత్రం పెంచారు. యుద్ధం మరో నెల పైన కొనసాగితే చమురు ధరలు బ్యారెల్‌ 150 డాలర్లకు చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. అప్పుడిక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలు పెంచక తప్పదు. బహుశా ప్రభుత్వం ఐదు రాష్ట్రాలలో ఎన్ని కలు పూర్తయ్యేవరకు వేచి చూస్తుంది. ఆస్ట్రేలియా, ద.కొరియా, నేపాల్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, యూఎస్‌ఏ మొదలగు దేశాలలో ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన పొదుపుపై ఆ దేశాలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. మన దేశంలో కూడా ఇంధన పొదుపు దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించటం; పనివేళలు, పని దినా లను తగ్గించటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

శత్రువులను ఎదుర్కోవాలంటే...
మన వంటిల్లు హార్మూజ్‌ జలసంధికి బందీ అవటం, మన ఎరువుల ఉత్పత్తికి గల్ఫ్‌ దేశాలపై ఆధారపడటం దేశ శక్తి భద్రత, ఆహార భద్రతలో డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఇంధన శక్తి, ఆహార ఉత్పత్తి దేశ మనుగడను శాసిస్తాయి. ఇలాంటి కీలక రంగాలలో స్వయం సమృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలి. చమురు, సహజ వాయువుల మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడటాన్ని తగ్గించాలి. బొగ్గు, జల విద్యుచ్ఛక్తి, సౌర శక్తి, పవన శక్తి వంటి శక్తి వనరుల అభివృద్ధి మీద దృష్టిని మరింతగా కేంద్రీకరించాలి. సౌర శక్తి, పవన విద్యుచ్ఛక్తి ప్లాంట్ల నిర్మాణానికి కావలసిన పరికరాలకు చైనామీద ఆధారపడుతున్నాము. కీలక రంగాలలో దిగు మతులపై ఆధారపడకూడదు. ముఖ్యంగా అస్థిర (గల్ఫ్‌) దేశాల మీద, శత్రు దేశాల (చైనా) మీద అసలు ఆధారపడకూడదన్నది యుద్ధం మనకు నేర్పుతున్న గుణపాఠం. 

ఇరాన్‌ యుద్ధంలో విద్యుచ్ఛక్తి కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, పారిశ్రామిక వాడలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కేంద్రాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవటం శత్రువుకు కలిసివస్తుంది. భారతదేశం కూడా చైనా, పాకిస్తాన్‌లతో ఏకకాలంలో యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరు శత్రువులు మూకుమ్మడిగా దాడి చేస్తే, మొదటి దెబ్బ మన మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌పైన, క్షిపణి కేంద్రాలపైన, యుద్ధయాన స్థావరాలపైన ఉంటుంది. డ్రోన్ల దండులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవ దశలో మన విద్యుచ్ఛక్తి కేంద్రాలు, చమురుశుద్ధి కర్మాగారాలు దాడికి గురవుతాయి. ప్రాంతీయంగా వీటిని వికేంద్రీ కరించాల్సి ఉంటుంది.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement
 
Advertisement
Advertisement