New Parliament Building: ఎన్నికల దండమా?

Sakshi Guest Column On Inauguration of Indian New Parliament

రెండోమాట

‘కర్రపుల్ల’తో అధికారం నిలబడాలేగానీ, దాని కోసం వెంపరలాడే ముందుపీఠిలో రాజకీయ నాయకులే ఉంటారు. ఏ రుజువులూ లేకపోయినా ‘సెంగోల్‌’ కర్రపుల్లని ‘రాజదండం’గా తెరమీదకు తెచ్చారు. కర్ణాటక తమ చేజారిపోగా, ఇప్పుడు రంగం తమిళనాడుకు మారింది. ‘సెంగోల్‌’ పదం ‘సికోలు’ నుంచి వచ్చింది. దీనికి జనసామాన్యంలో అర్థం చర్నాకోల అనే. దాన్ని ఎవరి మీద ఝళిపించాలి?

మన దేశంలో ఇంకా ‘భారత ప్రజలమైన మేము’ అని సగర్వంగా తొల్లింటి దేశ లౌకిక రాజ్యాంగానికి సమ్మతిని ప్రకటిస్తూ, భారత రిపబ్లిక్‌కు ముందుమాటగా చేసిన ప్రతిజ్ఞకు విలువ ఉందా?  రాజ్యాంగం 368వ అధికరణ ప్రకారం, లౌకిక రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చడానికి ఏ విభాగానికీ హక్కు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం కేశవానందభారతి, ఇందిరాగాంధీకి సంబంధించిన కేసులలో స్పష్టం చేసింది. బహుళ సంస్కృతులకు, విభిన్న మత విశ్వాసాలకు భారత సెక్యులర్‌ (లౌకిక) రాజ్యాంగ వ్యవస్థ నిలయమని స్పష్టం చేసింది.

14–16 అధికరణల కింద సమాన శ్రమకు సమాన వేతనం పొందే హక్కు ఉందన్న రాజ్యాంగ హక్కును 1979 నుంచి 1990 మధ్యకాలంలో ఆరు కేసులలో సుప్రీంకోర్టు ఖాయ పరిచింది. ఈ కేసుల న్నింటిలోనూ ఉన్నత న్యాయస్థానాలు రాజ్యాంగం తొలి ప్రతిజ్ఞకే కట్టుబడి ఉన్నాయి. కట్టుబడనిదల్లా కొన్నాళ్లు కాంగ్రెస్‌ పాలకవర్గమూ, ఆ తరువాత వాజ్‌పేయి హయామును మినహాయించి మిగతా ‘హిందూత్వ’ పాలక వర్గాలూ! వీటన్నింటి దుష్ఫలి తంగా – చివరికి దేశ సర్వ సేనాపతి, రాజ్యాంగ సంరక్షకులైన రాష్ట్రపతి హోదానే కించపరిచే దుఃస్థి తికి నేటి పాలకవర్గం పాల్పడింది. ఈ ‘డ్రామా’ కోసం విశ్వసనీయమైన రుజువులూ, పత్రాలూ లేక పోయినా ‘సెంగోల్‌’ను కనిపెట్టారు.

నిజానికి ‘కర్రపుల్ల’తో అధికారం నిల బడాలే గానీ, ఆ ‘పుల్ల’ కోసం వెంపరలాడే ముందుపీఠిలో రాజకీయ నాయకులే ఉంటారు. ‘సెంగోల్‌’ కర్ర పుల్లను ‘రాజదండం’గా చిత్రించడానికి చరిత్రకా రులైన శివనాగిరెడ్డిని, బాజ్జీరావును సహాయం కోరడం మరీ విచిత్రం. ‘నంది’ ధ్వజ రూపంలో ఉన్న ‘సెంగోల్‌’ పదానికి అర్థం వేరని ఎవరోగాదు, ఆ చరిత్ర పరిశోధకులే దాచుకోకుండా వెల్లడించాల్సి వచ్చింది. అసలు ‘సెంగోల్‌’ పదం ‘సికోలు’ పదం నుంచి వచ్చింది. చోళుల కాలం నుంచి ఈ ‘సికోలు’కు జనసామాన్యంలో అర్థం చర్నాకోల అనే.

ఇది లేకుండా పరిపాలన నడవదా? ఒకవేళ అది చేతిలో ఉన్నా ఎవరిమీద ఝళిపించాలి? అన్ని రాజ్యాంగ గ్యారంటీలను నేడు కోల్పోతున్న సామాన్య పౌరుల మీదా? పౌర హక్కుల ఉద్య మాల మీదా? మహిళా క్రీడాకారుల మీదా? వారిని లైంగిక దృష్టితో న్యూనపరచడానికి ప్రయత్నించి ఎదురుబొంక జూచిన బీజేపీ ఎంపీ మీదనా? పాల కుల నుంచి ఈ క్షణం దాకా సమాధానం లేదు, రాదు. అయినా పాలకుల దృష్టి మాత్రం ‘దంత కథ’గా మిగిలిపోయిన ‘సెంగోల్‌’ రాజదండంపై నుంచి తొలగదు.

ఆ మాటకొస్తే ఆది నుంచీ, తలపెట్టిన నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం కూడా మోదీ అడుగు ల్లోనే సాగుతూ వచ్చింది. అప్పుడూ దేశాధిపతి రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఆహ్వానానికి దూరం చేశారు. రాష్ట్రపతిగా తన ప్రతిపత్తికి బాహాటంగా జరుగుతున్న అవమానాన్ని ఆమె దిగమింగుకున్నా చూసే ప్రజలు మాత్రం పసిగట్టేశారు.

ఇప్పుడిక దేశానికి తొల్లింటి ప్రకటిత లౌకిక రాజ్యాంగం లేదు. ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రకటించుకోగల సత్తాను క్రమంగా కోల్పోవలసిన దుఃస్థితులు దాపురించాయి. తొల్లింటి లౌకిక రాజ్యాంగం ఇంకా బతికి ఉండాలన్నా; ప్రజల, పీడిత వర్గాల, దళిత, బహుజన వర్గాల మౌలిక ప్రయోజనాలు నెరవేరి, మనుగడ నిలవాలన్నా; తాము మరింత చైతన్యం పొందే వరకూ నేటి పరి స్థితుల్లో విశ్వసనీయమైన ఏకైక దుర్గం – 2025 ఆఖరి దాకా భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా చైతన్యమూర్తి అయిన చంద్రచూడ్‌ కొనసాగడం.

ఈ అవకాశాన్ని బలవంతంగా మార్చడానికి పాలక శక్తులు రకరకాల ‘విన్యాసా ల’కు పాల్పడతాయి. వాటిలో ఒకటి ఎలాంటి అధి కారాలు లేని అనధికార ‘దళాలు’. పిలిస్తే చాలు ‘కేరాఫ్‌’ రోడ్స్‌! చూడరాదూ–ఉన్నట్టుండి, నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవమూ, గాంధీజీ హత్యకు ప్రణాళిక పన్నాడన్న ఆరోపణను అనివార్యంగా భరించాల్సి వచ్చిన ‘హిందూత్వ’ సిద్ధాంతకర్తలలో ఒకరైన సావర్కార్‌ జన్మదినాన్ని నూతన పార్లమెంట్‌ ఆవిష్కరణ రోజునే జరపడమూ, పాత పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో అదే రోజున సావ ర్కార్‌కు నివాళులు అర్పించడమూ జరిగింది.

అన్నింటికన్నా గమనించదగిన అంశం – సెక్యులర్‌ రాజ్యాంగం కళ్ల ఎదుటనే యజ్ఞాలు, పూజ పునస్కారాలతో సర్వకార్య క్రమాలకు తెరలేపడం. దక్షిణాదిని ఉత్తరాది ‘జయించే’ విశ్వ ప్రయత్నా లలో తొలిమెట్టుగా కర్ణాటక రాష్ట్రం బీజేపీ చేజారిపోగా, ఇప్పుడు రంగం పక్కనున్న తమిళనాడుకు మారింది. తమిళనాడును జయించే మార్గాలలో భాగంగానే సంబంధం లేని ‘రాజ దండం’గా ప్రచారంలోకి ఎక్కిన ‘సెంగోల్‌’ దుడ్డు కర్ర కొంతమంది ‘స్వాముల’ ద్వారా చేతికి చిక్కింది. ఫ్యూడల్‌ సంస్కృతి, పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు అవలక్షణాలు కలగలిసి పోయిన వ్యవస్థలో నిజం కోసం తాపత్రయం మాత్రం ఆగదు.

‘నిరుద్ధ భారతం’ రచనలో దేశభక్తుడైన మంగిపూడి వెంకటశర్మ ‘శ్రుతి ప్రమాణములు జాతులు నాలు గెయంచు చెప్పగా ఐదవ జాతి ఎక్క డిదొ? ఆర్య మహా జనులార, చెప్పరే’ అని సూటిగా ప్రశ్నించాడు. ‘నాస్తితు పంచమః’ (పంచమజాతి అంటూ ఏదీ లేదు) అని మనుస్మృతి చెప్పినా చెవుల్లో పోసుకున్న ‘సీసం’ బయటకు రాదు. పాబ్లో నెరూడా వీరుల గురించి అంటాడు: ‘వాళ్లు చని పోలేదు, కాల్చే తుపాకీ గొట్టం ముందు నిటారుగా నిలబడ్డార’ని! అలాగే మన కవి శివసాగర్‌... పీడనా దోపిళ్ల నుంచి, ప్రజాకంటకుల నుంచి జన సామా న్యాన్ని విముక్తం చేసి సామ్యవాద ప్రజాస్వామిక యుగాన్ని ఆవిష్కరిచుకోవల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు (‘అమరత్వం’ కవిత):

‘‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది
చిన్నారి పువ్వు రాలిపోతూ
చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది...
సూర్యాస్తమయం చేతిలో చేయివేసి
సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది
అమరత్వం రమణీయమైంది
అది కాలాన్ని కౌగిలించుకొని
మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది.’’
అదే రేపటి సామ్యవాద ప్రజాస్వామిక యుగావిష్కరణం కావాలి. అంతేగానీ కావలసినవి అభినవ రాచరికాలూ, రాజదండాలూ కాదు!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top