Sakshi Guest Column Special Story On On Uniform Civil Code - Sakshi
Sakshi News home page

చెయ్యాల్సింది వదిలి ఇంకేదో చేస్తున్నారు!

Published Tue, Jul 18 2023 3:08 AM

Sakshi Guest Column On Uniform Civil Code

‘‘భారత రాజ్యాంగంలో కీలకమైన 44వ అధికరణ ప్రకారం దేశానికంతకూ కలిపి ఒకే ఒక పౌర స్మృతి అమలులో ఉండాలి. ఇది లేనందుననే దేశంలోని సామాజికులలో ఐక్యత, అమలు జరగాల్సిన ఆర్థిక న్యాయం కుంటుపడి పోతున్నాయి’’
– ఎం. వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ప్రకటన (7.7.2023)

వెనకటికొకడు ‘తాడి చెట్టు ఎందుకెక్కావురా’ అంటే, కల్లు కోసమనే రీతిగా సమాధానం చెప్పకుండా ‘దూడ మేత కోసం’ అని సమాధానం చెప్పాడట. ‘ఒకే దేశం ఒకే జాతి’ అనే బీజేపీ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ‘ఉమ్మడి పౌర స్మృతి’ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందనేది బహిరంగ రహస్యమే. అసమానతలను రూపు మాపుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది.

కానీ ఆ విషయాన్ని మరచి అందుకు పూర్తిగా భిన్నమైన భూస్వామ్య, పెట్టు బడిదారీ వ్యవస్థల మూలాలు చెక్కు చెదరకుండా భారత కాంగ్రెస్, బీజేపీ పాలకులు సంపూర్ణ మంత్రి వర్గాల పేరుతోనో, సంకీర్ణ ప్రభుత్వాల నాటకంతోనో ఇంతకాలం కాలక్షేపం చేస్తూ వచ్చారు. కుల, మత, వర్గ విభేదాలు ప్రజల మధ్య పెరగ డానికి, పాక్షిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుని తాత్కాలికంగా గట్టెక్కడానికి ఎత్తులు, పైఎత్తులతో కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. అటువంటి ఒక ఎత్తుగడే ‘ఉమ్మడి పౌర స్మృతి.’ 

తమ స్వార్థ రాజకీయాలను వివిధ అణగారిన ప్రజా శక్తులు ఆందోళనల ద్వారా, సమ్మెల ద్వారా, ఉధృత స్థాయిలో ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటూ వస్తూండటంతో పాలక వర్గాలు అరెస్టులు, కాల్పులు, నిర్బంధ విధానాల ద్వారా ప్రజా శక్తుల్ని అణచ జూస్తు న్నారు. ఈ సందర్భంగా, ప్రజలపై నిర్బంధ విధానాన్ని అమలు జరపడం ద్వారా పాలకులు అనుసరించే ఎత్తుగడలకు విచిత్రమైన రెండు ఘటనలను చరిత్రనుంచి ఉదహరించుకుందాం: ముందుగా పాత సోవియెట్‌ యూనియన్‌లో చోటుచేసుకున్న సంఘటన.

పంటలు పండించడంలో ఆరితేరిన ఒక రైతు ఒక మార్కెట్‌ స్క్వేర్‌లో నిలబడి, ‘మన వ్యవసాయ మంత్రి ఒక తెలివితక్కువ దద్దమ్మ (ఫూల్‌) అని అరిచాడట. అంతే ఆ రైతును అరెస్టు చేసి 10 సంవత్సరాల ఒక మాసం పాటు జైల్లో నిర్బంధించారు. అందులో ఆ రైతు, మంత్రి గారిని ‘ఫూల్‌’ అని అగౌరవ పరచినందుకు ఒక మాసం పాటు, ప్రభుత్వ గుట్టును రట్టు చేసినందుకు 10 ఏళ్ళూ శిక్ష విధించారు. ఇంతకూ అసలు రహస్యం – ఆ రైతు పెద్ద మంత్రిని ఎద్దేవా చేసినందుకు విధించిన జరిమానా చిన్నదే, కానీ మంత్రిని ‘పనికిమాలిన దద్దమ్మ’ అన్న విమర్శ ప్రజల మనస్సుల్ని బాగా ప్రభావితం చేసినందుకు బారీ పెనాల్టీ విధించడం జరిగిందట!

అలాగే మన దేశంలో జరిగిన మరో సంఘటన చూద్దాం. ‘నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ... వీళ్లందరి ఇంటిపేర్లుగా మోదీ ఎలా వచ్చింది? దొంగలందరి ఇంటిపేరుగా మోదీ ఎలా వచ్చింది’ అన్న రాహుల్‌ గాంధీ ‘జోక్‌’ కూడా క్రిమినల్‌ కేసులో చేరిపోయింది. దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ సంజయ్‌ హెగ్డే వ్యాఖ్యా నిస్తూ ‘జోక్‌ను, విమర్శను పరువు నష్టం కింద భావించి ఒక వ్యక్తిని అమెరికాలో జైలులో నిర్బంధించరు. ‘ఏలిననాటి శని’ లాంటి వలస చట్టం వల్ల ఇది ఇక్కడ సాధ్యమయింద’న్నారు.

‘ఏదో ఒక మోదీని అవమానించారని కాదు, మోదీలందరినీ ఉద్దేశించి అన్న సాధారణ అర్థంలో రాహుల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని కోర్ట్‌ శిక్ష విధించింది’ అని ఆయన వివరించారు. పలువురు వ్యక్తులను సంబోధించే క్రమంలో ఇంటి పేర్లు, వంశనామాలు పెట్టి పిలిచినంత మాత్రాన ‘పరువు నష్టం’ కింద జమ కట్టడానికి వీలు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన హోమీ మోదీ, లాలా మోదీ, సయెద్‌ మోదీ, పూర్ణేందు మోదీ వంటి పేర్లను ప్రస్తావించారు. 

భారత రాజ్యాంగానికి విశిష్టమైన వ్యాఖ్యాన పరంపర అందించిన సుప్రసిద్ధ మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమ నేతల్లో అగ్రజుడైన ఉన్నత న్యాయవాది కేజీ కన్నాభిరాన్‌ దేశంలోని పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తల్ని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేసి, నిరా ధారమైన ఆరోపణలతో జైళ్లపాలు చేసినప్పుడు నిద్రాహారాలు లెక్క చేయ కుండా వారికి లీగల్‌ సహాయం అందించి విడుదలయ్యేటట్టు చేశారు. నక్సలైట్‌ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన రక్షణ కమిటీకి కన్వీనర్‌గా పనిచేశారు.

దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును ప్రస్తావిస్తూ కన్నాభిరాన్, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరును ప్రస్తావించి ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలోని కోర్టులు అధికార, అనధికార స్థానాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న బలవంతులైన వారిని దుర్మార్గపు పరిణామాలకు బాధ్యుల్ని చేసి శిక్షించలేక పోతున్నాయి. చివరికి అణగారిన కార్మికులు ఆత్మగౌరవం కోసం పోరాడు తున్న సందర్భాల్లో కూడా అలాంటి వారి రక్షణకు కొన్ని కోర్టులు ముందుకు రావడం లేదు’’!

చివరగా... చరిత్రలో కొందరు పాలకులు ప్రజలపైన, చివరికి, ప్రసిద్ధ చరిత్రకారులపైన ఎన్ని కిరాతకమైన ఆంక్షలు విధిస్తారో, దుర్మార్గాలకు పాల్పడుతుంటారో తెలియచేసే ఉదాహరణ ఒకటి చూద్దాం. చైనా చరిత్రలో ‘సీమా కియాన్‌’ అనే ప్రసిద్ధ  చరిత్రకారుడు చక్రవర్తిని విమర్శించి ప్రజల ముందు అభాసుపాలు చేశాడు. అందుకు ఆ చక్రవర్తి ఒక దుర్మార్గమైన ‘ఆఫర్‌’ ఇచ్చాడు. చేసిన నేరానికి ‘ఉరిశిక్ష కావాలా లేక ఆ స్థానంలో నపుంస కుడిగా మారి పోతావా’ అని అడిగాడు. మరి తాను చరిత్రకారుడు కాబట్టి  నపుంసకుడిగా ఉండిపోయి అయినా తాను ప్రారంభించిన చరిత్ర రచనను పూర్తిచేయాలనుకున్న కియాన్‌ నపుంసకునిగా మారడానికే మొగ్గాడు.

(సైమన్‌ సీబాగ్‌  మాంటిఫియోర్‌  ‘ది వరల్డ్‌: ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్‌ హుమా నిటీ’). బహుశా కారల్‌ మార్క్స్‌ మహనీయుడు అందుకే అని ఉంటాడు: ‘‘మనుషులు తమ చరిత్రను తామే లిఖించుకుంటారు. కానీ, తమ ఇష్టా ఇష్టానుసారంగా రాసుకుంటూ పోలేరు. ఎవరికి వారు తమకు తామై ఎంచు కునే సందర్భాల ప్రకారమూ రాసుకోలేరు. మరి ఏ పునాది ఆధారంగా రాస్తారు – సిద్ధాన్నంలాగా అప్ప టికే ఉన్న పరిస్థితులు ఆధారంగా, గతం నుంచి సంక్రమించిన పరిస్థితులు ఆసరాగా తప్ప మరొక మార్గం లేదు’’!
అవును కదా మరి –
‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను
తనువులోన పుట్టు తత్వమెల్ల
శ్రమములోన పుట్టు సర్వంబు తానేను’’!

abkprasad2006@yahoo.co.in 

Advertisement
 
Advertisement