ఔషధ నియంత్రణపై రెండు నాలుకలు

Sakshi Guest Column On drug regulation

దేశీ మార్కెట్‌లో చాలా నకిలీ మందులు చలామణీలో ఉన్నాయన్న కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యలు బయటికి పొక్కడం కలకలం రేపింది. మళ్లీ ఆయనే అధికారిక సమావేశాల్లో నాణ్యమైన ఔషధాలు తయారవుతున్నాయని నొక్కిచెప్పారు. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమాలున్న మందులూ దొరుకుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. 

ఉజ్బెకిస్తాన్, గాంబియా... రెండు వేర్వేరు దేశాల్లో సుమారు 70 మంది పిల్లలు కల్తీ దగ్గుమందు కారణంగా మరణించారు. ఇటీవలి కాలంలో సంభవించిన ఈ దుర్ఘటనకు కారణమైన దగ్గు మందు సరఫరా అయ్యింది మన దేశం నుంచే. కొన్ని వారాల క్రితం నోయిడా పోలీసులు ఉజ్బెకిస్తాన్ మరణాలకు సంబంధించి ముగ్గురు ఫార్మా కంపెనీ ఉద్యోగులను అరెస్ట్‌ చేయగా... కొన్ని నెలల క్రితం గాంబియా ఘటనకు సంబంధించి దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది.

ఈ రెండు కేసుల్లోనూ దగ్గుమందులో విషపూరిత రసాయనాలు కలిసి ఉండటం గమనార్హం. గాంబియా ఘటనలను ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం దృష్టికి తెచ్చింది. భారత్‌ నుంచి ఎగుమతి అయిన దగ్గు ముందులో గుర్తించిన డైఎథిలీన్  గ్లైకోల్‌ (డీఈజీ) కారణంగా మూత్ర పిండాలు పనిచేయకుండా పోయి పిల్లలు మరణించినట్లు అమెరికాకు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’ కూడా ఈ వారమే ధ్రువీకరించింది. 

ఈ ఘటనలకు కేంద్ర ఆరోగ్య శాఖ, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్  (సీడీఎస్‌సీఓ), రాష్ట్రాల డ్రగ్‌ కంట్రోలర్లు, ఫార్మా స్యూటికల్‌ డిపార్ట్‌మెంట్‌ల స్పందన అంతంత మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గాంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో లోపాలపై దృష్టి పెట్టాయి కానీ... ఆయా సంస్థలు గుర్తించిన అంశాల జోలికి ఇవి పోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇవ్వకపోవడాన్ని విమర్శించి ఉరకున్నాయి. 

ఆరోగ్య శాఖ నెపం మొత్తాన్ని గాంబియాపై నెట్టేసింది. దిగుమతి చేసుకునేటప్పుడు పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని తేల్చేసింది. అంతటితో ఆగకుండా... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్కో కేసులో మరణానికీ, ఔషధానికీ ఉన్న సంబంధాన్ని వివరించలేదని వ్యాఖ్యానించింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే... గాంబియా కొన్ని కేసుల్లో శవపరీక్షలు కూడా నిర్వహించి డీఈజీ అవశేషాలను గుర్తించిందని!

అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్‌ మాండవియా ఈ ఘటనలన్నింటినీ భారత ఔషధ పరిశ్రమను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగానే పరిగణించడం! గత నెల 24న వంద భాగస్వామ్య దేశాల భారత దౌత్యవేత్తలు పాల్గొన్న సమావేశంలోనూ మాండవియా దేశంలో నాణ్యమైన మందులు తయారవుతున్నాయని నొక్కి చెప్పడం ఇక్కడ ప్రస్తావించ దగ్గ అంశం.

కేంద్ర ఆర్యోగ శాఖ మంత్రి ప్రకటనల్లో ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జరిగిన ఓ రహస్య సమావేశంలో దేశంలో మందుల నియంత్రణ దుఃస్థితిని ఆయన నేరుగా అంగీకరించారు. ‘‘దేశీ మార్కెట్‌లో చాలా నకిలీ మందులు చలామణిలో ఉన్నాయి.

కల్తీ మందులు ఎగుమతి అవుతున్నాయి కూడా. దీనివల్ల ఫార్మా రంగం విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ఒప్పు కొన్నారు. ఈ దుఃస్థితికి అధికారులే కారణమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘ఫార్మా రంగానిదే బాధ్యత. కానీ అంతకంటే ముందు ఇది మన బాధ్యత’’ అని ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

నియంత్రణ వ్యవస్థల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇది చురుకుగా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వ యమూ కొరవడుతోంది’’ అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అంచనా ప్రకారం, ప్రస్తుత నియంత్రణ వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల సంస్థలు, ఫార్మాస్యూటికల్‌ విభాగాల పేరుతో ముక్కలు ముక్కలుగా ఉంది. మాండవియా ప్రసంగం యూట్యూబ్‌ ఛానల్‌లో ఎనిమిది నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది.

ఆ తరువాత ఆగిపోవడమే కాకుండా... అప్పటివరకూ రికార్డయిన వీడియోను కూడా ఛానల్‌ నుంచి తొలగించారు. అయితే వీడియో తొలగించినంత మాత్రాన విషయం బయ టకు పొక్కకుండా ఉంటుందా? నిపుణులు ఎంతో కాలంగా చెబుతున్న విధంగానే నియంత్రణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లేని, కల్తీ, నకిలీ మందులు భారతీయ మార్కెట్‌లో చలామణి అవుతున్నట్లు అందరికీ అధికారికంగా తెలిసిపోయింది. ఇలాంటి మందులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నట్లు... దుష్ఫలితాలూ వాటివల్లనే అన్న విషయమూ స్పష్టమైంది.

మంత్రి ప్రకటనను బట్టి చూస్తే దేశ ఫార్మా రంగం దుఃస్థితికి కారణాలు ఆయనకూ తెలుసన్నమాట. మరి ఇదే నిజమైతే ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏం చేస్తున్నట్లు? గాంబియా, ఉజ్బె కిస్తాన్  ఘటనలపై వ్యతిరేక నివేదికలు వచ్చినప్పుడు బహిరంగంగా ఫార్మా రంగాన్ని, నియంత్రణ వ్యవస్థలకు మద్దతుగా మాట్లాడటం ఎందుకు? ఈ రెండు నాల్కల ధోరణిని వదిలిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో కూడిన వ్యవహారం. 

దేశ ఫార్మా రంగ నియంత్రణ సంస్థల్లోని అకృత్యాలు ఇప్పుడు కొత్తగా తెలిసినవి ఏమీ కాదు. 2012లోనే ఒక పార్లమెంటరీ కమిటీ సీడీఎస్‌సీఓ పనితీరుపై విచారణ జరిపి, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న అక్రమాలను బయటపెట్టింది. దురదృష్టవశాత్తూ అప్పటినుంచి ఇప్పటివరకూ జరిగిన మార్పు స్వల్పమే.

పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు కాగితానికే పరిమితమైపోయాయి. ప్రభుత్వాలు కూడా ఈ రంగాన్ని  సంస్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయలేకపోయాయి. ఇంకోవైపు ఫార్మా పరిశ్రమ ఎదుగుదలకు నియంత్రణ వ్యవస్థలు ప్రతిబంధకంగా మారుతున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

దేశ ఫార్మా మార్కెట్‌ సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం పది లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చునని కూడా ఆయన అంచనా కట్టారు. ఇది కచ్చితంగా మంచి లక్ష్యం. కానీ భద్రత, సామర్థ్యం, మందుల ప్రమాణాలతో రాజీపడి సాధించడం ఎంతమాత్రమూ సరికాదు. స్థానిక మార్కెట్‌ అయినా, విదేశీ మార్కెట్‌ అయినా వీటిని పాటించడం అవసరం.

ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వా లన్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమా లున్న మందులూ దొరుకుతున్నాయి.

వేర్వేరు బ్రాండ్లు ఉండటంతో వైద్యులను ఆకర్షించేందుకు కంపెనీలు అనైతిక మార్కెటింగ్‌ కార్య కలాపాలకూ దిగుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచి నంతమాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. నిజానికి జన ఔషధి కేంద్రాల స్థాపన ఆలోచన మాజీ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ది.

2005లోనే ఆయన యూపీఏ కామన్  మినిమం ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కేంద్రాల ఏర్పాటును ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఔషధ కంపెనీల నుంచి జెనెరిక్‌ మందులను ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సంకల్పించారు.

ఈ ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీల్లో అత్యధికం ఇప్పుడు పనిచేయడం లేదు. లేదా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి, సమస్య పరిష్కా రానికి బహుముఖ వ్యూహం అవసరం. దేశంలోని నియంత్రణ వ్యవస్థ లను గాడిలో పెట్టడంతో మొదలుపెడితే సరైన దిశలో ముందడుగు వేసినట్లు అవుతుంది!

వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top