ఆలోచన రేపుతున్న కథనాలు | Sakshi
Sakshi News home page

ఆలోచన రేపుతున్న కథనాలు

Published Mon, Sep 25 2023 2:30 PM

Sakshi Guest Column Different Style Movies

ప్రపంచమంతటా హిట్‌ అయిన ‘డాక్టర్‌ హూ’ రచయిత స్టీవెన్‌ మొఫాట్‌ ఒకసారి, ‘చివరకు, మనందరమూ కథలమే’ అని రాశాడు. విశిష్టమైన కథలలో జీవిస్తూ, శ్వాసిస్తూ, ప్రేమిస్తున్న ఒక కళాకారుడిగా అది నిజమని నాకు తెలుసు. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోగల కథల పట్ల మనం చాలా గట్టిగా స్పందిస్తాం. అదీ ఏదో మానవాతీతమైన బృహత్తర మైనదానికి మనల్ని అనుసంధానించినప్పుడూ, భాష, భౌగోళిక ప్రత్యేకతల పరిమితులను అధిగమించి మానవత్వాన్ని చవిచూసేలా చేసినప్పుడే! ఉదాహరణకు వ్యక్తిగత లక్ష్యం, స్నేహం, మానవతావాదానికి చెందిన ఇతివృత్తం కలిగినదైనందువల్లనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చాలా సన్నిహితం అయ్యింది.

ఉత్తర అమెరికాలో 1 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు, ఆస్ట్రేలియాలో రెండున్నర లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్లు దాటి వసూలు చేసిన మొదటి కన్నడ చిత్రంగా ‘కాంతార’ సాధించిన అద్భుత విజయానికి దాని ఉద్వేగ భరితమైన నేటివిటీయే సహాయపడింది. గొప్ప నమ్మకంతో ఈ సినిమాను సృష్టించారు. పైగా మానవ భావోద్వేగాలు ప్రతిచోటా ఒకేలా ఉంటాయని మనకు గుర్తు చేస్తూనే, ఆ చిత్రం దాని సొంత నీతికి కట్టుబడి ఉంది. ప్రతి ధ్వనించే భావోద్వేగాలు, ప్రత్యేకమైన సాంస్కృతిక సందర్భం, ప్రపంచ స్థాయి టెక్నిక్‌ని కలిగి ఉన్నందున దక్షిణ భారత చిత్ర పరిశ్రమల కంటెంట్‌ని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

గురుదేవులు రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఒకసారి ఇలా అన్నారు: ‘ఎవరూ ప్రపంచ భారాన్ని మరింతగా పెంచకూడదు, ప్రతి ఒక్కరూ దానిని తగ్గించడానికి ప్రయత్నించాలి.’ ఈ భారాన్ని తగ్గించడానికి కథలు చెప్పడం ఉత్తమ మార్గం అని నేను భావిస్తున్నాను. భాషకు అతీతంగా మనల్ని కలిపే కథలు మనం ఒంటరిగా లేమని గుర్తుచేస్తాయి. పైగా అవి మన భావోద్వేగాలను తిరుగులేని విధంగా ప్రభావితం చేస్తాయి. జపనీస్‌ రచయిత అకిరా కురసోవా తీసిన 1954 క్లాసిక్‌ చిత్రం, ‘ది సెవెన్‌ సమురాయ్స్‌’ని తీసు కోండి. దీన్ని దాదాపు ప్రతి భాషలోనూ రీమేక్‌ చేశారు. దాని ఇంగ్లీష్‌ వెర్షన్‌ 1960లో జాన్‌ స్టర్జెస్‌ తీసిన ‘ది మాగ్నిఫిసెంట్‌ 7’, హిందీ వెర్షన్‌ 1975లో ‘షోలే’. విజయ్‌టెండూల్కర్‌ రాసిన ‘గిధాడే’, ‘శాంతత! కోర్ట్‌ చాలూ ఆహే’, ‘సఖారం బైండర్‌’, ‘కమలా’, ‘మిత్రాచి గోష్టా’ వంటి మరాఠీ నాటకాలను వివిధ భాషల్లోకి అనువదించారు. వీటిలో చాలా నాటకాలు ఇప్పుడు ‘జీ థియేటర్‌’లో హిందీలో అందుబాటులో ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా, భారతీయ వినోద పరిశ్రమ మంచి కథా కథనాలపై దృష్టి సారించినందుకు నేను సంతోషిస్తున్నాను. థియేటర్‌ అయినా, సినిమా అయినా, ఓటీటీ అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్‌ కంటెంట్‌ ప్రభావాన్ని మనం చూస్తున్నాం. దక్షిణ కొరియా, స్పెయిన్, ఫ్రాన్స్, అర్జెంటీనా, జపాన్, జర్మనీ వంటి అనేక ఇతర దేశాల నుండి కథలు ఇప్పుడు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. అలాగే మన కథకులు కూడా ఇంతవరకు ఎవరూ చెప్పని కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే సుపరిచితమైన కథనాలను కూడా తిరిగి ఆవిష్కరిస్తున్నారు. డబ్బింగ్, సబ్‌టైటిలింగ్‌ల ద్వారా కథల పరిధిని విస్తరిస్తున్నారు. సాంస్కృతికంగా సున్నితమై నవీ, సందర్భోచితమైనవీ అయిన ఉపశీర్షికలూ; సంభాషణకు చెందిన సారాంశాన్ని సంగ్రహించేలా, రెండు భాషల సూక్ష్మ నైపుణ్యాలను పుణికిపుచ్చుకున్న మంచి అనువా దకులు, ట్రాన్‌స్క్రైబర్లు ఇందుకు ఎంతో అవసరమనేది ఈ సందర్భంగా గమనార్హం. 

ఇక థియేటర్‌ గురించి చెప్పాలంటే, ఇది కూడా మౌఖిక సంప్రదాయాల నుండి వీధి ప్రదర్శనలు, ప్రోసినియం (పరదాకు ముందు థియేటర్‌ వేదికకి చెందిన భాగం) ప్రదర్శనలతోపాటు, ముఖ్యంగా టెలివిజన్‌ ప్రేక్షకుల కోసం రూపొందించిన టెలిప్లేల వరకు అభివృద్ధి చెందింది. ఇవి ఇప్పుడు భాషా సరిహద్దులను దాటి విస్తృత శ్రేణి థీమ్‌లను, పాత్రలను సృష్టిస్తున్నాయి. మనం అలాంటి సృజనాత్మక ప్రకంపనల కాలంలో జీవి స్తున్నందుకూ; నా టెలిప్లేలలో ఒకటైన ‘మా రిటైర్‌ హోతీ హై’ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు కన్నడ, తెలుగు భాషలలో అందుబాటులో ఉన్నందుకూ నేను ఎంతో పులకరించి పోతున్నాను

మంచి కథలలోని మరొక ముఖ్య అంశం ఏమిటంటే – అవి ఆలోచనలను రేకెత్తిస్తాయి. చాలా సూక్ష్మంగా సామాజిక మార్పును ఉత్కృష్ట స్థాయిలో ప్రారంభిస్తాయి. ఉదాహరణకు – స్వలింగ సంబంధాలు, లింగ పరమైన రాజకీయాలతో సహా అనేక సామాజిక సమస్యల గురించి మన ఆలోచనలను సరిదిద్దుకునేలా చేయడంలో చేతన్‌ దత్తర్, విజయ్‌ టెండూల్కర్‌ వంటి నాటక రచయితల రచనలు సహాయపడ్డాయి. టెండూల్కర్‌ రాసిన ‘కమలా’ను చలనచిత్రంగా రూపొందించినప్పుడు సాధారణ స్త్రీల, మరీ ముఖ్యంగా గిరిజన స్త్రీల గౌరవం గురించి తీవ్రమైన సామాజిక చర్చ రేకెత్తింది.

ఈరోజు కంటెంట్‌కు టెక్నిక్‌ సహాయం చేసినమాట నిజమే అయినా, కొత్త బాధ్యతలవైపు మారడానికీ, సమస్యల ప్రపంచంలో వారి స్థానం గురించి కొత్తగా ఆలోచించడానికీ ప్రజలను ప్రేరేపించే కథనాలు ఇప్పటికీ అవసరమే. భారతదేశంలో అటువంటి సుసంపన్నమైన కథనాలకు ఎన్నడూ కొరత లేదు. అవి అపారమైన సాంస్కృతిక, భౌగోళిక వైవిధ్యం నుండి ఉద్భవించినప్పటికీ వాటికి మనల్ని కదిలించే, తరలించే శక్తి ఉంది. మనల్ని కలిసికట్టుగా నవ్వుతూ, దుఃఖిస్తూ జీవితాన్ని ఆస్వాదింప చేస్తాయి.


యతిన్‌ కార్యేకర్‌, వ్యాసకర్త ప్రముఖ బాలీవుడ్‌ నటులు.

Advertisement
 
Advertisement