దూకుడు కన్నా సమన్వయానికే మొగ్గు | Sakshi Guest Column On BJP Telugu States new presidents | Sakshi
Sakshi News home page

దూకుడు కన్నా సమన్వయానికే మొగ్గు

Jul 1 2025 12:13 AM | Updated on Jul 1 2025 12:13 AM

Sakshi Guest Column On BJP Telugu States new presidents

బీజేపీ నూతన రాష్ట్రాధ్యక్షులు: పి.వి.ఎన్‌.మాధవ్‌ (ఏపీ), ఎన్‌.రామచంద్రరావు (తెలంగాణ)

విశ్లేషణ

‘మంచి ప్రారంభంతో సగం పని అయిపోయినట్టే’ అంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కొత్త అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను తామలానే జరిపించగలిగామని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో ఎన్‌.రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్‌లో పి.వి.ఎన్‌. మాధవ్‌ కొత్త అధ్యక్షులుగా ఎన్నికవడం చూస్తే, సుదీర్ఘ కాలం పార్టీనే అంటిపెట్టుకొని ఉండటం, సైద్ధాంతిక బలం వంటి అంశాలకే ప్రాధాన్యమిచ్చిందని స్పష్టమౌతోంది. 

తాజా నిర్ణయంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావమూ విస్పష్టమే! పార్టీని దూకుడుగా తీసుకు వెళ్లటం కన్నా, ‘గ్రూప్‌’ల బెడద లేకుండా, ఐక్యంగా నడిపించటం పైనే అధిష్ఠానం దృష్టి నిలిపిందనిపిస్తోంది. పార్టీకి లభించే తక్షణ ఊపు కన్నా, ఎన్డీయే కూటమికి దీర్ఘకాలికంగా ఒనగూరే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. బయటి నుంచి వచ్చే నేతలకు లభించే ఇతర అందలాల సంగతెలా ఉన్నా, వారు పార్టీ సంస్థాగత పదవులు, హోదాల్లోకి రావటం అంత తేలికైన అంశం కాదనీ మరోమారు సంకేతాలు ఇచ్చినట్టయింది.

జాప్యం జరిగినా తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక విషయంలో బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే అడుగులు వేసింది. అభ్యర్థుల ఎంపికలో, దూకుడు స్వభావం కన్నా సంయమనం, సమన్వయం నెరిపే నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ, కూటమి పార్టీల మధ్య సఖ్యతకు విఘాతం రానీయకుండా చూసుకోవడమే కాక... తెలంగాణలో అటువంటి భవిష్యత్‌ అవకాశానికి దారులు తెరచి ఉంచింది. 

రేపు అది తెలుగుదేశం–జనసేనతో జట్టు కొనసాగించడమైనా కావచ్చు, కాదు పరిస్థితులు మారితే భారతæ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)తో జోడీ కట్టడమైనా కావచ్చు. పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లో మెదలవటమే కాకుండా, ఢిల్లీ నాయకత్వం నిర్దేశించిన తరహాలో రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల్ని నడపగలిగే అణకువ గలిగిన నాయకత్వానికి పీట వేసింది. 

మొదట్నుంచీ పార్టీలోనే ఎదిగిన ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఎన్‌.రామచంద్రరావు (తెలంగాణ), పి.వి.ఎన్‌. మాధవ్‌ (ఏపీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయేట్టు వ్యూహరచన చేసింది. దూకుడు నాయకత్వం ఉండుంటే, ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ వైపు వలసలుంటాయేమోననే భయం ఆ పార్టీకి ఉండేది. ఇప్పుడా భయం పోయింది.

వీగిన తెలంగాణ చిక్కుముడి
తెలంగాణలో పార్టీ రాష్ట్రాధ్యక్ష ఎన్నిక బీజేపీ అధినాయకత్వానికి ఒక దశలో సవాల్‌గానే మారింది. పలువురు నాయకులు ఈ పదవిని ఆశించడమే కాకుండా ముమ్మరంగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. తర్జన –  భర్జనల తర్వాత త్రాసు రామచంద్రరావు వైపు మొగ్గింది. ఈ పదవిని ఆశించడమే కాకుండా ఢిల్లీ నాయకత్వాన్ని మెప్పించే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు నిరాశే మిగిలింది. 

ఈటలకు పార్టీలో ‘చేరికల కమిటీ’కి నేతృత్వం ఇచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో చేరికలు జరగకపోవడం, పార్టీలో పాత –కొత్త నాయకుల మధ్య స్పర్థ పెరగటం వంటివి అధినాయకత్వానికి చీకాకు కలిగించాయి. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరగటం, గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్‌లోనూ ఆయన ఓడిపోవడం వంటివే కాక బీజేపీ సంస్థాగత ఎన్నికల నిబంధనలు కూడా ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి. 

ఈటలకు పార్టీ అధ్యక్ష పీఠం దక్కకపోవడమొక్కటే కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మిగిలిన సంతృప్తి కావచ్చని పార్టీలో గుసగుసలున్నాయి. బయటకు ఆసక్తిని వెల్లడించకపోయినా, ఒక దశలో తాను పోటీదారును కాదని ప్రకటించినా.... మరోమారు అధ్యక్షుడు కావాలని ఆయనకు లోలోపల ఉండినట్టు తెలుస్తోంది. 

అందుకు కారణం, లోగడ ఆయన బాగా పనిచేస్తున్నప్పుడు, పార్టీకి మంచి ఊపు తెచ్చినపుడు అర్ధంతరంగా ఆయన్ని తప్పించడమే! పార్టీ ఎదుగుదలకు ‘నేనే’ కారణం అనే స్థితిలోకి అధ్యక్షుడు వెళ్లిపోయారనీ, ‘నేను’ను బీజేపీ నాయకత్వం అంగీకరించదనీ పార్టీలో కొందరు అప్పట్లో అన్వయం చెప్పేవారు. ఇక తెలంగాణ అధ్యక్ష స్థానానికి ఎంపీలు అర్వింద్, డీకే అరుణ, రఘునందనరావు, డా.లక్ష్మణ్‌  పేర్లు ప్రచారంలోకి రావటమన్నది ఆటలో అరటిపండే!

సత్తా కన్నా సంకేతాలకే మొగ్గు
బీజేపీ అధిష్ఠానం వైఖరి కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి నిలిపిన గొప్ప చరిత్ర ఏమీలేదు. ఏదో సమీకరణాల్లో... అయితే రాష్ట్రం రావాలి, కాదంటే వ్యూహం నెరవేరి ఎన్డీయేకు లబ్ధి చేకూరాలి. 

ఏపీ, తెలంగాణల్లో అధ్యక్షుల ఎన్నికకు అదే వ్యూహాన్ని అనుసరించినట్టు కనిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య సఖ్యతకు, సయోధ్యకు మాజీ ఎమ్మెల్సీ (పట్టభద్రుల స్థానం) పి.వి.ఎన్‌. మాధవ్‌ అధ్యక్షులైతే అందరికీ ఆమోదయోగ్యంగా, అధిష్ఠానానికి తలలో నాలుకలా ఉంటారనే తాజా నిర్ణయానికి వచ్చినట్టుంది. 

కూటమి మిత్రులకు ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలివ్వడం పార్టీకి ముఖ్యం. మాధవ్‌ దివంగత నేత పి.వి.చలపతిరావు తనయుడు. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఉండి, ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగానూ పనిచేసిన చలపతిరావుకు మంచి పేరుండేది. కోస్తాంధ్ర ప్రాంతం నుంచి సుదీర్ఘకాలం ఆయనే బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.

ఇక తెలంగాణలో రామచంద్రరావు అధ్యక్షుడవడం చాన్నాళ్లుగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న పాత నాయకులకు సంతృప్తినిచ్చే నిర్ణయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) నుంచి, యువమోర్చా నుంచి ఎదిగి వచ్చిన నాయకుడాయన. సంప్రదింపుల్లో దిట్ట అని పేరుంది. 

ఎమ్మెల్సీగా (పట్టభద్రులకు) ప్రాతినిధ్యం వహిస్తూ మండలిలో పార్టీ నాయకుడిగా ఉన్నారు. ప్రజలు తమకు అవకాశం ఇస్తే, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన పార్టీ అధినాయకత్వం ఇతర అగ్రవర్ణాలను దూరం చేసుకోవద్దన్న వ్యూహమే ఇక్కడ పనిచేసి ఉంటుంది. 

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనయ కవిత ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయినపుడు, ఆ పార్టీని బీజేపీతో జతచేయడమో, విలీనమో.... ప్రతిపాదనలొచ్చాయని ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ....తాజా అధ్యక్ష ఎంపిక/ఎన్నిక కీలకమైంది. రేపు ఏదైనా పరిణామాల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ జట్టు కట్టాల్సివస్తే పార్టీకి సంయమనంతో వ్యవహరించే నాయకత్వం ఉండాలని ఇప్పట్నుంచే ఢిల్లీ నేతలు యోచించినట్టుంది. 

ఈటల రాజేందర్, బండి సంజయ్‌... ‘వారిద్దరిలో ఎవరికిచ్చినా వేరొకరు సహకరించక పోదుర’నే బలమైన అభిప్రాయముంది. ఇప్పటికే సిటీ వర్గం, నిజామాబాద్‌ బ్యాచ్, కరీంనగర్‌ టీమ్‌... ఇలా వర్గాలుగా చీలి ఉన్న తెలంగాణ బీజేపీలో మరో కొత్త వర్గాన్ని పుట్టించకుండా అధిష్ఠానం జాగ్రత్తపడిందనే సంతృప్తి కొందరిలోనైనా ఉంది. 

దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఒకప్పుడు చెప్పిన మాటలీ సందర్భంలో గుర్తుకొస్తాయి. బీజేపీకి సన్నిహితంగా పనిచేస్తూ, ఒక దశలో బీజేపీలో చేరే ఆలోచన చేసిన టీడీపీ నాయకుడు పర్వతనేని ఉపేంద్రనుద్దేశించి వాజ్‌పేయి ఈ మాటలన్నారు: ‘మీ పనితీరు మాకు అతకదేమో! మీరు ఇక్కడ ఇమడలేరు, మా వాళ్లు ఇమడనివ్వరు కూడా’ అని ఆ పెద్దాయన నర్మగర్భంగా చెప్పారు. అది కరడుగట్టిన సత్యమని తెలంగాణ బీజేపీ రాజకీయాలు నిరూపించాయి.


దిలీప్‌ రెడ్డి 
వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement