మాట్లాడుతున్న రాంచందర్‌రావు, చిత్రంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు
పార్టీ బలోపేతంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌తో చర్చలు
తెలంగాణలోనూ త్వరలో డబుల్ ఇంజిన్ సర్కార్: మాధవ్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై రాంచందర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌లు శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన మాధవ్, రాంచందర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర పథకాలు అమలవుతున్న తీరు, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సమాలోచనలు జరిపారు.
సమావేశం తర్వాత రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, పార్టీని మరింత విస్తరిస్తామని తెలిపారు. మాధవ్ మాట్లాడుతూ.. గతంలో బీజేపీ యువమోర్చా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సందర్భాల్లో పలుమార్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోనూ త్వరలోనే డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కార్యాలయానికి రావడం స్వగృహానికి వచ్చినట్లుగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలోనూ విస్తృత పరిచయాలు ఉన్న రాంచందర్‌రావు ఇక్కడ అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉందన్నారు.


