సంఘీభావమే పరాయీకరణకు మందు

Sakshi Guest Column On Alienation human relations

విశ్లేషణ 

మనిషి క్రమంగా మనిషితనానికి దూరమై మాయమవుతున్నాడు. ఆధునిక పెట్టుబడిదారీ ఉత్పాదక వ్యవస్థలో అతడు ఒక మహాయంత్రంలో చిన్న ‘మర’ లాంటి పాత్రను పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సృజనాత్మకతను కోల్పోయి వస్తూత్పత్తి యంత్రంగా మిగిలిపోతున్నాడు. తాను తయారుచేసే వస్తువు పట్ల సంతృప్తి పొందలేకపోతున్నాడు. ఇలా మొత్తంగా పరాయీకరణకు గురై... మనిషి సొంత గుర్తింపు రద్దు అవుతున్న స్థితిలో, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవసరం ఉన్నా లేకున్నా... వస్తువులను కొంటూ పోతున్నాడు. ఈ వస్తు వినిమయంలోనే ఆనందాన్ని వెదుక్కొంటున్నాడు. తద్వారా వస్తువులే మానవ సంబంధాలను నిర్ణయించే స్థితి ఏర్పడుతోంది. అందుకే సముదాయాల నడుమ అర్థవంతమైన సంఘీభావాన్ని నిర్మించడమే ఇప్పుడు కావలసింది.

పెట్టుబడిదారీ విధానాన్ని సునిశిత విమర్శకు గురి చేసే కార్ల్‌మార్క్స్‌ నేటికీ తన ప్రాసంగికత కోల్పోలేదు. పెట్టుబడిదారీ విధానంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, అలాగే వేతన శ్రామికుని పరాయీ కరణ జరిగే విధానాన్నీ మార్క్స్‌ పేర్కొన్నాడు. తన తొలి రచనలలో– మనిషి తన పట్ల, తన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల ఎరుక ఉన్న జీవిగా (స్పీసీస్‌–బీయింగ్‌) ఒక రకమైన పరాయీకరణకు గురవ్వడాన్ని ప్రస్తావించాడు.

తరువాతి కాలపు రచనలలో ఆయన ఎక్కువగా ఈ పరాయీకరణకు కారణమైన వ్యవస్థీకృత సాంకేతిక అంశాల మీద చూపు నిలిపాడు.  పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతిలో శ్రామికులు సాధా రణంగా తాము చేసే వస్తు ఉత్పత్తితో ముడి పడి ఉండే సంతృప్తినీ, ఉత్పత్తి అయిన వస్తువుతో తమకు జోడై ఉండే గుర్తింపునూ ఎట్లా కోల్పోతారో వివరించే యత్నం చేశాడు.

శ్రమ విభజన ప్రధానంగా ఉండే పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతిలో ఉత్పత్తి సామర్థ్యానికి ఇచ్చే ప్రాధాన్యం వల్ల శ్రామికులు వస్తూత్పత్తిలోని ఏదో ఒక అంశానికే పరిమితమై ఆ పనిని మాత్రమే గానుగెద్దులా చేసే యంత్రంలా మారి పోతారనీ, ఈ క్రమంలో తమ సాధారణ మానవ సున్నితత్వాలనూ, ఉత్పత్తితో ఉండే గుర్తింపునూ కోల్పోతారనీ మార్క్స్‌ వివరిస్తాడు. 

ఈ రకమైన పరాయీకరణ వలన శ్రామికులకు తాముచేస్తున్న పనులతో మమేకత్వం ఉండదు. ఈ అంశాన్నే సమకాలిక మానవ శాస్త్రవేత్త డేవిడ్‌ గ్రాబార్, పెట్టుబడిదారీ యుగంలో ‘పనికిమాలిన ఉద్యోగాలు’ (బుల్‌షిట్‌ జాబ్స్‌) ఉన్నాయని ప్రతిపాదించాడు. పనికి మాలిన నౌకరీ అంటే ఏమిటో వివరిస్తూ గ్రాబార్‌ – అవి వేతన  శ్రామి కులకు ఏమాత్రం తృప్తిని ఇవ్వనివీ, అర్థరహితమైనవీ అంటాడు.

ఇంకా చెప్పాలంటే శ్రామికులు చేస్తున్న పనులు వారి సొంత విలువను ఏ తీరులోనూ పెంచేవి కావనీ అంటాడు. అర్థరహితం, విలువలేని పనులు రాను రానూ అనేక రంగాలలోకి విస్తరిస్తున్నాయనిపిస్తుంది. పెచ్చుపెరిగిపోతున్న ఆటోమేషన్, కృత్రిమ మేధకు లభిస్తున్న ప్రాధాన్యం చూస్తే రాబోయే కాలంలో ఈ పరిస్థితి తీవ్రం అయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ స్థితి తీవ్ర మానవ అసంతృప్తికి కారణం అవుతోంది.  

చేసిన పని నుండి మనం పొందే తృప్తి ఎందుకు మనకు అంద కుండా పోతుంది? మనం ఒక మహా ప్రక్రియ (యంత్రం)లో ప్రాధా న్యంలేని చిన్న పని చేసే ‘మర’ స్థాయికి కుదించబడటమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఉత్పత్తి ప్రక్రియలో ఒక సహజమైన ఉత్సాహ శక్తి ఉబికి రావడం మరుగున పడిపోయి... వాటి స్థానంలో ఆర్థిక, గణిత, అల్గారిథమ్స్‌లకు ప్రాధాన్యం వచ్చింది. చరిత్రకారుడు యువల్‌ నోవా హారారీ ఇరవై ఒకటవ శతాబ్దిలో అత్యంత ప్రధానమైన పదం  కంప్యూటర్‌ ఆధార గణన లేక ‘అల్గారిథమ్స్‌’ అంటాడు.

ఈ మారిన పని పరిస్థితులను జాగ్రత్తగా గమనించిన అభివృద్ధి అర్థ శాస్త్రవేత్త గై స్టాండింగ్‌... ‘ప్రికారియట్‌’(అసురక్షిత లేక అస్థిర కార్మి కులు) తప్పని పరిస్థితులు అన్న భావన  తీసుకువచ్చారు. ఈ భావన ప్రకారం పర్మనెంటు నౌకరీలు తగ్గిపోతూ... కాసింత ఉద్యోగ భద్రత, పెన్షన్‌ సౌకర్యం, ఆరోగ్య రక్షణ వంటివి పూర్తిగా కనుమరుగైపోయి స్వల్పకాల కాంట్రాక్టులు, తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఈ రకమైన నూతన శ్రామికులను ‘ప్రికారియట్‌’ అంటున్నాడాయన. సమకాలిక పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో కొత్త పని ప్రపంచాలు వీరితో నిండిపోతున్నాయని అంటున్నాడు. మన కాలంలో పని... అర్థరాహిత్యానికీ, అభద్రతకూ ఏకకాలంలో దారితీస్తోంది. 

గై స్టాండింగ్, మార్టిన్‌ గ్రాబర్‌ వంటి సామాజిక పరిశీలకులు ఈ రకమైన పనికిమాలిన పనులకు, దారుణమైన అభద్రత గల పని పరిస్థితులకు సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌) ఒక పరిష్కారంగా చూస్తున్నారు. అయితే పని లేదా శ్రమ లక్ష్యం కేవలం ఆదాయ సంపాదన మాత్రమే కాదు. అది పని  చేస్తున్న వారికి ఆత్మతృప్తినీ, పరిపూర్తి అనుభూతినీ ఇవ్వడం కూడా ప్రధానం అన్న అమర్త్య సేన్‌ చెప్పిన ఒక విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి.

ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇట్లా మనిషి సొంత గుర్తింపు రద్దు అవుతున్న స్థితిలో, మనిషి కొనుగోలుదారుగా మారి... కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తన కప్పిపుచ్చుకునే కొనుగోలుదారీతనంతో భర్తీ చేసుకునే కంపెన్సేటరీ కన్సూ్యమరిజమ్‌లోకి మారిపోతున్నాడు. అలా మారి ‘తాము బాగున్నాం’ అనేదానికి గుర్తుగా వస్తువులు కొను క్కోవాలి అనే ‘కొనుగోలుదారీ’ అవస్థలోకి జారుకుంటున్నాడని ప్రముఖ మార్క్సిస్ట్‌ భూగోళ విజ్ఞాని డేవిడ్‌ హార్వే విశ్లేషిస్తున్నారు. ఇటువంటి కొనుగోలుదారీతనానికి నెట్‌ఫ్లిక్స్‌ను ఉదాహరణగా చూపుతున్నాడు. ఈ రకమైన వస్తువులు మీటనొక్కడం ద్వారా అనేక మంది ఒకేసారి వాడుకునే లక్షణం కలిగి ఉన్నవి. కళ్ళు జిగేల్మనే మాల్స్‌లో షాపింగ్‌ అనుభూతి ఒక కొత్త లోకంలోకి పోయిన అనుభూతిని ఇస్తుంది. ఆ విధంగా మానవ జీవితాలను వస్తువులు ఆక్రమించేస్తున్నాయి.

మనుషులు తమ ఇంగితాల మీద, సున్నితత్వాల మీద నియంత్రణ కోల్పోతారని మార్క్స్‌ చాలాకాలం కిందనే ఊహిం చాడు. దాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వస్తువులే మానవ సంబంధాలను నిర్ణయించే స్థితి ఏర్పడుతుంది. వస్తువులకు ఉండే మారకపు విలువనే వస్తువు ఉపయోగ విలువను నిర్ణయిస్తుంది. ఈ స్థితినే ఆయన ‘వస్తు వ్యామోహ సంస్కృతి’ అన్నాడు. ఈ పరిస్థితే దుస్సహమైన పని పరిస్థితులను, పనికిమాలిన ఉద్యోగాలను పుట్టించి మనుషులలో తీవ్రమైన పరాయీకరణకు దారితీస్తుందనీ అన్నాడు. ఆ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. 

ఈ ఆధునిక పరాయీకరణ పరిస్థితులు కేవలం ఆర్థిక రంగానికి అంటే మార్కెట్‌కు మాత్రమే పరిమితమై ఉండవు. అవి సామాజిక, వ్యక్తిగత, రాజకీయ జీవితాలలోకి కూడా వ్యాపిస్తాయి. రాజ్య యంత్రమూ, దానికున్న సార్వభౌమాధికారమూ; అది నియంత్రించే ప్రాంతం మీదా, ప్రజల మీదా ఉండే అధికారం సందర్భంలోనూ ఈ పరాయీకరణ ప్రభావం కనిపిస్తుంది. ప్రజల నుండి పాలన పరాయీకరణకు గురి కావడం ఒక కీలక అంశం.

పాలనాధికారం విపరీతంగా కేంద్రీకరించబడటం, పాలకులు తాము చాలా ప్రత్యేకం అనుకోవడం, సామాన్య ప్రజలను దూరం పెట్టడం ఈ పరాయీకరణ రూపాలే. ‘అరబ్‌ స్ప్రింగ్‌ ’ పోరాటాలూ, ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌’ పోరా టాలూ... పరాయీకరించబడిన సమూహాలు, జాతి రాజకీయ జీవ నంతో తిరిగి పెనవేసుకోవడానికి పడుతున్న ఆరాటానికి చిహ్నాలు! పాలనా యంత్రాంగం, ప్రతినిధులు... ప్రజారాశుల నుండి పూర్తిగా వేరుపడటం అనే పరాయీకరణ ప్రాతినిధ్య సంక్షోభానికి (క్రైసిస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేషన్‌) దారి తీస్తున్నది. ప్రతినిధులను ప్రజలు నమ్మని స్థితి ఇది. ఒక రకంగా పైన పేర్కొన్న పోరాటాలు ఈ అవినీతికర స్థితికి వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శించే ఆగ్రహ వ్యక్తీకరణగా అర్థం చేసుకోవచ్చు. 

ఇలాంటి వాతావరణంలో పరాయీకరణ వల్ల ప్రేరేపితం అయిన నిస్సార కొనుగోలుదారీతనానికీ, ప్రాతినిధ్య సంక్షోభం వల్ల పుట్టు కొస్తున్న, పరిమిత దృష్టి కలిగిన తమ వాటాకు మాత్రమే ప్రాధాన్య మిచ్చే ఉనికి రాజకీయ వాదులకూ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. తమ పరిధిని తీవ్రంగా పరిమితంగా ఉంచుకునే ఉనికి రాజకీయాలకూ, నిస్సార కొనుగోలుదారీ తత్వానికీ కారణం... మనిషి తన నుండీ, సముదాయం నుండీ పరాయీకరించ బడటమే. ఈ స్థితిలో ఊహాశక్తితో అనేక (పీడిత) సముదాయాల నడుమ నాణ్యమైన, అర్థవంతమైన సంఘీభావాన్ని నిర్మించే వైపు చేసే గట్టి ప్రయత్నాలు మాత్రమే... పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పోరును పదు నెక్కించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలవు. 

ప్రొ. అజయ్‌ గుడవర్తి 
వ్యాసకర్త ప్రొఫెసర్,జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top