RTI Act: సామాన్యుడి వజ్రాయుధం

Right to Information Act Completes 17 Years, How to File RTI - Sakshi

ఎన్నో ఏళ్ళ ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్‌ 12న సమాచార హక్కు చట్టం భారత్‌లో అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలు ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండటానికీ, పౌరులకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికీ ఈ చట్టం రూపొందింది. తెలంగాణ సమాచార కమిషన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి 2017 సెప్టెంబర్‌ 9న వేరయింది. ఈ సమయంలో బదిలీ అయిన పిటీషన్లు 6,825 కలుపుకొని... తెలంగాణ రాష్ట్రంలో దాఖలైన మొత్తం దరఖాస్తులు 38,000. అందులో ఇప్పటివరకూ 32,000 పరిష్కారం అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవి కేవలం 6,000 మాత్రమే. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పుడు కూడా కొంతకాలం టెలిఫోన్‌ ద్వారా కేసులు విచారించి, పరిష్కరించిన చరిత్ర మన కమిషన్‌ది. 

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక బోర్డు ఏర్పాటై ఉంటుంది. దాని మీద ప్రజా సమాచార అధికారి ఫోన్‌ నంబర్‌ ఉంటుంది. తమకు కావలసిన సమాచారం కోసం ఆ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి 10 రూపాయలు చెల్లించి లేక తెల్ల రేషన్‌ కార్డు ఉంటే ఒక జిరాక్స్‌ పెట్టి సెక్షన్‌ 6(1) కింద దరఖాస్తు చేసుకుంటే చాలు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అయితే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మండల స్థాయిలో రూ. 5,  జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలలో రూ. 10 రుసుం చెల్లించాలి. (క్లిక్ చేయండి: జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?)

మీరు దరఖాస్తు చేసుకున్న నాటినుంచి సెక్షన్‌ 7(1) ప్రకారం 30 రోజుల్లో అందులో కోరిన సమాచారం ఇవ్వాలి.  8, 9 సెక్షన్ల కింద మినహాయింపు పొందిన సమాచారం తప్ప... మిగతా సమా చారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని నిరాకరిస్తే మొదటి అప్పిలేట్‌ అధికారికి సెక్షన్‌ 19 (1) కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా సమాచారం నిరాకరిస్తే సెక్షన్‌ 19 (3), సెక్షన్‌ 18(1) కింద సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మొత్తం మీద సమాచార హక్కు చట్టాన్ని సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా చెప్పవచ్చు.

– డాక్టర్‌ గుగులోతు శంకర్‌ నాయక్, తెలంగాణ సమాచార కమిషనర్‌
(అక్టోబర్‌ 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top